జిల్లాలో అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

Oct 6 2026 1:36 AM | Updated on Oct 6 2026 1:36 AM

● వలసల నివారణకు ఉపాధి హామీలో

పనులు కల్పించాలి

● జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన

వైఎస్సార్‌సీపీ నేతలు

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలోని అన్ని మండలాలను కరువుగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వలసల నివారణకు వెంటనే ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలన్నారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరికి వైఎస్సార్‌సీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో తీవ్రమైన కరువు నెలకొన్నా రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. అశాసీ్త్రయమైన శాటిలైట్‌ విధానంతో వర్షపాతాన్ని లెక్కించి కేవలం 15 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించారని, అలా కాకుండా పంటనష్టం ఆధారంగా మిగిలిన 12 మండలాలను కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

నష్టపరిహారం ఏదీ?

తమ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను అమలు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందిచామని ఎస్వీ గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ఉచిత పంటల బీమాను ఎత్తివేశారని, రైతులను ప్రభుత్వమే ఆదుకోవాల్సి ఉందన్నారు. పంటలు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు, వర్షం పడకపోవడంతో పంటలు వేయలేని రైతులకు ఎకరాకు రూ.15 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేయాలని, రైతులకు తిండి గింజలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పశుగ్రాసం లేక అన్నదాతలు తమ పశువులను అమ్ముకుంటున్నారని, వారిని ఆదుకోవడానికి తక్షణమే పశుగ్రాసం సరఫరా చేయాలన్నారు.

అన్ని మండలాల్లో నిరసన చేస్తాం!

పంటలు రాక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తినడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వలసబాట పడుతున్నారని ఎస్వీ అన్నారు. ఉపాధి హామీ పథకంలో విస్తృతంగా పనులు కల్పించాలని కోరారు. అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగాల భరత్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ..శాటిలైట్‌ విధానంతో కొన్ని మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. పంటనష్టం ఆధారంగా మిగిలిన మండలాలను కరువు ప్రాంతాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు గణపురం శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌గౌడ్‌, ఆస్పరి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దొరబాబు, బీసీ సెల్‌ నాయకులు గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement