మహానంది: అర్చక వృత్తిలో ఉండేవారు నుదుటను విభూతి, తిలక, కుంకుమ ధారణలతో సంప్రదాయంగా కనిపిస్తూ సర్వజనుల ఆదరణ పొందాలని ఏపీ ఆదిశైవ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకంఠం నందీశ్వరయ్య, రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (ఎస్‌ఐటీఏ) రాష్ట్ర డైరెక్టర్ ముక్తేశ్వరరావు అన్నారు. మహానందిలోని టీటీడీ కల్యాణ మండపంలో రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం శైవ ఆగమ శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను లయ కార్యనిర్వహణాధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, పండితులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నందీశ్వరయ్య, డైరెక్టర్ ముక్తేశ్వరరావులు మాట్లాడుతూ.. అర్చకులు హరిహర స్వరూపులని, చూస్తేనే నమస్కరించేలా ఉండాలన్నారు. ఆలయాల్లో అర్చకులు చేసే పూజలు, హోమాల ద్వారా లోక కల్యాణం కలుగుతుందని స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన సీనియర్ అర్చకులు నారాయణశర్మ మాట్లాడుతూ.. ఆలయాలు, వాటి నిర్మాణం శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ముడిపడి ఉన్నాయన్నారు. ఆలయాలు కేవలం ఆధ్యాత్మికతనే కాకుండా అన్ని శాస్త్రాలను మిళితం చేసేలా కనిపిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సుబ్బసత్యనారాయణ శర్మ, మహానంది ఉప ప్రధాన అర్చకులు వనిపెంట జనార్థనశర్మ, ముఖ్య అర్చకులు రాజమాణిక్యశర్మతోపాటు యాగంటి, నందవరం, పుటాలమ్మ తల్లి, భోగేశ్వరం, ఓంకారం, శివనంది ఆలయాలతో పాటు జిల్లాలోని వివిధ ఆలయాల అర్చకులు పాల్గొన్నారు.


