● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
కర్నూలు: పోలీసు అధికారులు కొందరు ఖాకీ డ్రెస్సులు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని సోమవారం కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ శివారులోని జిల్లా కారాగారంలో ములాఖత్ ద్వారా కలసి కాటసాని పరామర్శించారు. ఎమ్మెల్యే విరూపాక్షికి ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడటం ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ప్రజల తరఫున పోరాడే నాయకులను ఎంతగా అణచివేయాలని ప్రయత్నించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తుందన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు రాజకీయానికి లోబడకుండా రాజ్యాంగం, చట్టాల ప్రకారమే విధులు నిర్వహించాలన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రావడం పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తుందన్నారు. అధికారాలు శాశ్వతం కాదని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పనిచేసిన సేవే ఎప్పటికీ గుర్తుండిపోతుందని గుర్తు చేశారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, అక్కిమి హనుమంత రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గాజుల శ్వేతారెడ్డి, నారాయణ రెడ్డి, కర్నూలు యువజన విభాగం అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి, పాలకొలను రమేష్, సాయికృష్ణ, ఎరుకల రాజు తదితరులు కాటసాని వెంట ఉన్నారు.


