● తుంగా ప్రాజెక్ట్ నుంచి 90 వేల
క్యూసెక్కుల నీరు విడుదల
హొళగుంద: కర్ణాటకలోని చిక్ మంగళూరు, కొప్ప, శివమొగ్గ, శృంగేరి, వరనాడు, మలేనాడు, తీర్థనహళ్లీ తదితర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో టీబీ డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అక్కడి వాగులు, వంకలు, వరద పోటెత్తి 3.10 టీఎంసీల సామర్థ్యం కలిగిన తుంగా ప్రాజెక్ట్ (గాజనూరు జలాశయం) నిండడంతో 22 గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగా ప్రాజెక్ట్ నుంచి నదికి వదులుతున్న నీరంతా భద్ర నదిలో సంగమై తుంగభద్రగా మారి టీబీ డ్యాంలోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో టీబీ డ్యామ్‌కు సోమవారం 65 వేల క్యూసెక్కుల వరకు ఉన్న ఇన్‌ఫ్లో క్రమేణా పెరుగుతోంది. టీబీ డ్యామ్‌కు ఆశాజనకంగా వరద నీటి చేరికతో కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాల పరిధిలోని దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా టీబీ డ్యామ్ నుంచి తాగునీటి అవసరాల కోసం ఎల్లెల్సీకి విడుదల చేసిన నీరు ఆంధ్రకు చేరుకోగా సోమవారం 250 కి.మీ వద్ద 630 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి.


