కర్నూలు(అర్బన్): నగర శివారుల్లోని దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం(బాలికలు)లో జూనియర్ ఎంఈసీ, సీఈసీలో మిగులు సీట్ల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రిన్సిపాల్ బి.నిర్మల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఎంఈసీలో ఎస్సీ–3కు ఐదు, ఎస్టీకి 01, ఓసీకి 01 సీటు.. అలాగే జూనియర్ సీఈసీలో బీసీ–02, ఎస్టీ–02, ఓసీ–01 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ సీట్ల భర్తీకి బీఆర్‌ఏజీసీఈటీ 2026 ఎంట్రెన్స్ రాసిన వారు అర్హులన్నారు. అర్హులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు తమ గురుకులంలో కలిసి ప్రవేశం పొందవచ్చన్నారు.
పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్స్
కర్నూలు సిటీ: ఎస్.జి.పీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 2026–27 విద్యా సంవత్సరానికి బయో మెడికల్ ఇంజనీరింగ్, అప్‌లైడ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులలో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలీసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసిన, రాయని వారు, ఇంత వరకు పాలిటెక్నిక్‌లో అడ్మిషన్ పొందని వారు, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 5న ఉదయం 11 గంటలకు స్పాట్ కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 9052437831 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
వినియోగదారులకు అందుబాటులో ఉండండి
కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు మరింత జవాబుదారీతనంతో పని చేయాలని విద్యు త్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమంలో వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అప్పుడే సమస్యలను సత్వరం పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఈఈ లు, డీఈఈ, ఏడీఈలు వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు మండలాల్లో జల్లులు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాలు కేవలం జల్లులకే పరిమితమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 4 మండలాల్లో జల్లులు కురిశాయి. పెద్దకడుబూరులో 10.4 మి.మీ, నందవరంలో 3.6, దేవనకొండలో 3.2, ఎమ్మిగనూరులో 2.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. ఆగస్టు నెలలో మూడు రోజుల్లో కురిసిన వర్షం 3.5 మి.మీ మాత్రమే. సోమవారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. వర్షాలు లేకపోగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలు మరింత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో కూడా వర్షాలు లేకపోగా.. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.
లంచం కేసులో జైలు, జరిమానా
కర్నూలు: కడప విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎంఆర్ శ్రీనివాసులును దోషిగా నిర్ధారించడంతో రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ కర్నూలులోని సీబీఐ కేసుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి శోభారాణి సోమవారం తీర్పు వెలువరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు, అతని సంస్థను బ్లాక్ లిస్ట్‌లో వేసే ప్రక్రియను ప్రారంభించకుండా ఉండేందుకు 2015 జులై 24న రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి మొదటి విడతగా రూ.25 వేలు తీసుకుంటుండగా కడప ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించగా అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 7 మరియు సెక్షన్ 13(2) ప్రకారం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎస్.మనోహర్ వ్యవహరించారు.


