మంత్రాలయం: శ్రీమఠంలో ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరగనున్న స్వామివారి 355వ ఆరాధనోత్సాల సందర్భంగా ముందస్తు గదుల బుకింగ్‌ను రద్దు చేసినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్‌కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సోమవారం శ్రీమఠంలో విలేకరులతో మట్లాడుతూ.. ఆరాధనోత్సవాలకు దాదాపు 6 నుంచి 7 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులు అఽధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్ రూమ్ బుకింగ్ రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు మేనేజర్ తెలిపారు. 11వ తేదీన టీటీడీ కళ్యాణ మండపంలో ఆరాధనోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ అధికారులు, శ్రీమఠం సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 12వ తేదీన శ్రీమఠాలు ఆల్ బ్రాంచ్ మేనేజర్‌లతో వీవీఐపీ డైనింగ్ హాల్‌లో సమావేశం ఉంటుందన్నారు. ఆరాధనోత్సవాలకు కలెక్టర్, ఎస్పీల అనుమతులు కోరినట్లు చెప్పారు. పంచాయతి సిబ్బంది శుభ్రతను పాటించే విధంగా చూడాలన్నారు. తుంగభద్ర నదిలో భద్రత, బోట్లు, స్విమ్మింగ్ సిబ్బంది అని కూడా లెటర్లు పంచామన్నారు. ఆగస్టు 30న హెలికాప్టర్‌తో రథోత్సవంపై పుష్పవృష్టి కురిపించేందుకు ఫైర్ సిబ్బంది, అధికారుల అనుమతులు కోరామన్నారు. 75 ఇంచులతో టీవీ, హుండీ కౌటింగ్ హాల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 5వ తేదీన హుండీ లెక్కింపు చేపడతామని వెల్లడించారు.
వర్సిటీ టాపర్‌కు గోల్డ్‌మెడల్
కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగం టాపర్‌గా నిలిచిన డాక్టర్ పర్వేజ్ నవాజ్‌కు బంగారు పతకం దక్కింది. కర్నూలు జీజీహెచ్ కార్డియాలజీ విభాగంలో పీజీ విద్యనభ్యసిస్తున్న (2022–2025) ఆయన వర్సిటీ టాపర్‌గా నిలిచారు. ఈయనకు ఆసుపత్రి మొదటి కార్డియాలజిస్టు డాక్టర్ టి.రామకృష్ణారెడ్డి పేరిట ఆయన కుమారుడు డాక్టర్ టి.విజయ్‌కృష్ణారెడ్డి గోల్డ్ మెడల్ అందజేశారు. సోమవారం కార్డియాలజీ విభాగంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తండ్రి జ్ఞాపకార్థం కుమారుడు డాక్టర్ విజయకృష్ణారెడ్డి ఏటా మెరిట్ విద్యార్థులకు బంగారు పతకం ఇవ్వడం అభినందనీయమన్నారు. డాక్టర్ టి.విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏటా కేఎంసీ విద్యార్థులే వర్సిటీ టాపర్‌లుగా నిలుస్తుండటం సంతోషకరమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ లక్ష్మిబాయి, ఐఎంఏ కర్నూలు కార్యదర్శి డాక్టర్ ఎస్వీ రామమోహన్‌రెడ్డి, వైద్యాధికారులు ఆదిలక్ష్మి, ప్రశాంత్, లలితకుమారి, చింతా రాజ్‌కుమార్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రవికిరణ్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీ
మహానంది: మండలంలోని గాజులపల్లె, బసవాపురం గ్రామాల సరిహద్దుల నుంచి గ్రావెల్ మట్టిని తరలిస్తున్న టిప్పర్లు మితిమీరిన వేగంతో వెళ్తుండటం ప్రమాదకరంగా మారింది. నూతనంగా నిర్మిస్తున్న హైవే రహదారికి నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నాయి. టిప్పర్లు వేగంగా వెళ్తుండటంతో వచ్చి, వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అల్లినగరం గ్రామం వద్ద ఆగి ఉన్న ఓ టిప్పర్‌ను వెనుక నుంచి వస్తున్న మరో టిప్పర్ ఢీకొట్టింది. డ్రైవర్‌కు స్వల్పగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహానంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలకు అంతరాయం లేకుండా టిప్పర్లను రోడ్డు పక్కన పెట్టించారు. ఇదిలా ఉండగా సంబంధిత అధికారులు స్పందించి టిప్పర్లు నిర్ణీత వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు శ్రీరామ్ నగర్‌కు చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు (27) అప్పుల బాధతో విరక్తిచెంది ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను నగరంలోని ఐశ్వర్య క్యాంటీన్‌లో పనిచేస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. వారి నుంచి తిరిగి చెల్లించాలని ఒత్తిడి ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఈయనకు భార్యతో పాటు కూతురు, కొడుకు సంతానం. భార్య పుట్టినిల్లు పెరవళికి వెళ్లింది. ఎంత అప్పులు చేశాడు. ఎవరెవరి దగ్గర అప్పులు చేశాడనే విషయం భార్య వచ్చిన తర్వా త తెలుస్తుందని పోలీసులు తెలిపారు. భార్య ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని నాల్గవ పట్టణ పోలీసులు తెలిపారు.


