కర్నూలు కల్చరల్: వాస్తవ జీవితానికి ప్రతిబింబంగా కథలు రాస్తూ తెలుగు దళిత సాహిత్యంలో సంచలనంగా నిలిచినవి ‘బ్లాక్ రెయిన్ బో’ కఽథలని ప్రసిద్ధ సాహితీ వేత్త గుంటూరు లక్ష్మీ నరసయ్య అన్నారు. ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ రాసిన దళిత కథలు ‘బ్లాక్ రెయిన్ బో’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకంలోని కథలు వైవిధ్యతను సంతరించుకున్నాయని, రాయలసీమ నేపథ్యంలోని అసమానతలు, మారుతున్న సమాజంలో రూపం మార్చుకున్న వివక్షత ఇందులో కథలుగా ఆవిష్కరించబడ్డాయన్నారు. వర్తమాన సాహిత్య సమాజంలో ఈ దళిత కథలు అనివార్యమని, ఇవి సమాజానికి ప్రతిబింబంగా కనబడతాయన్నారు. సాహితీ స్రవంతి జిల్లా గౌరవాధ్యక్షుడు ఎంపీ బసవరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి వెంకట కృష్ణ, ఆర్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, రాయలసీమ ప్రచురణలు సంపాదకులు ఇనయతుల్లా, గౌరవ సంపాదకులు మారుతి, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు కురాడి చంద్రశేఖర కల్కూర మాట్లాడారు. పశ్చిమ ప్రాంత మాండలికంలో కథలు రాయడం వల్ల కథా సాహిత్యంలో అరుదైన శిల్పంగా కనబడతాయన్నారు. సాహిత్రీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్, నగర అధ్యక్షుడు ఆకెపోగు నాగరాజు, ప్రధాన కార్యదర్శి పార్వతయ్య, కవులు, రచయితలు పాల్గొన్నారు.


