● ఏబీవీపీ కలెక్టరేట్ ముట్టడి
కర్నూలు(సెంట్రల్): విద్యా శాఖను మంత్రి నారాలోకేశ్ భ్రష్టు పట్టించారని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎర్రిస్వామి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం కర్నూలు కలెక్టరేట్ ఎదుట అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. అధికారులు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని కోరగా అందుబాటులో లేరని చెప్పడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి వెళ్లేందుకు మెయిన్ గేట్లు ఎక్కడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చివరకు అధికారులను కలిసేందుకు ఐదుగురు విద్యార్థి సంఘం నాయకులను తీసుకెళ్తామని అక్కడి పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఈ సందర్భంగా ఎర్రిస్వామి మాట్లాడుతూ పాదయాత్రలో విద్యా రంగ సమస్యలపై లేనిపోని హామీలు ఇచ్చి విద్యార్థి, యువతను తీవ్రంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6800 కోట్లు ఉన్నా ఎందుకు విడుదల చేయడంలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జీఓ 77 రద్దు చేస్తామన్న లోకేష్‌కు ఎన్ని వంద రోజులు కావాలని ప్రశ్నించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కేటగిరీల పేరుతో చేసే దందాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ యుగంధర్, జిల్లా కన్వీనర్ వీరేష్ పాల్గొన్నారు.


