● కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంతోపాటు అన్ని మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలున్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు.
పది మండలాల్లో తేలికపాటి వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో రుతుపవనాలు బలహీనపడిపోయాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని 10 మండలాల్లో తేలికపాటికే వర్షం కురిసింది. పెద్దకడుబూరులో 25.4 మి.మీ. వర్షం కురియగా.. మిగిలిన మండలాల్లో జల్లులకే పరిమితం అయ్యాయి. కౌతాళంలో 8.6, గోనెగండ్లలో 7.8, ఎమ్మిగనూరులో 4.2, కల్లూరులో 2.6, కోడుమూరులో 2.4, కోసిగిలో 2.2, మద్దికెరలో 1.0, కర్నూలు రూరల్‌లో 0.4, కర్నూలు అర్బన్‌లో 0.4 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ సంస్థ ప్రకటించింది.
ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వోగా శ్యామల
కర్నూలు కల్చరల్: అటవీ శాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వోగా ఐఎఫ్‌ఎస్ పి. శ్యామల నియమతులయ్యారు. అటవీ శాఖ జిల్లా అఽధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్యామలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓగా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డేవిడ్ పదవీ విరమణ పొందడంతో కర్నూలు డీఎఫ్‌ఓ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇన్‌ఛార్జి డీఎఫ్‌ఓగా వ్యవహరించనున్నారు.
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి
కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
క్వింటా వేరుశనగ గరిష్ట ధర రూ.8,290
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటం వేరుశనగ గరిష్ట ధర రూ.8,290లు పలికింది. మార్కెట్‌కు 4,616 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటం వేరుశనగ కనిష్ట ధర రూ.3,130లు, మధ్యస్థ ధర రూ.6,745ల ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. ఆముదాలు క్వింటం రూ.5,100కు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు.
హైవేపై ఎలుగుబంటి హల్‌చల్
పాములపాడు: మండలంలోని ఎర్రగూడూరు గ్రామ సమీపంలో జెమ్మి చెట్టు నేషనల్ హైవేను దాటుతూ ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఎలుగుబంటిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో పెద్ద శబ్దంతో హారన్‌లు కొడుతూ కేకలు వేశారు. దీంతో ఎలుగుబంటి పరుగున అడవిలోకి వెళ్లిపోయింది. ఎలుగుబంటి విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో అటువైపు వెళ్లేందుకు ప్రజలు సాహసించలేదు. అటవీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి అటవీ సమీప గ్రామాల్లోకి అడవి జంతువులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


