కర్నూలు సిటీ: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా సబ్ బేసిన్‌లోని తుంగభద్ర నది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, భీమ, మలప్రభ, ఘట్టప్రభ నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఈ నీటి సంవత్సరం ఆలస్యంగానైన ఆల్మట్టి డ్యాం గేట్లు ఐదు రోజుల క్రితం తెరచుకున్నాయి. ఆ డ్యాం నుంచి ఉదయం 8 గంటల సమయంలో 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆ నీటినంతా దిగువన ఉన్న నారాయణ పూర్‌డ్యాంకు వదిలారు. అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి. జూరాల నుంచి వదిలిన నీరు సప్తనదుల సంగమానికి, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తోంది. కృష్ణా నది కంటే ముందుగానే తుంగభద్ర నదిలో వరద నీటి ప్రవాహాలు కనిపించినా..ఆశించిన స్థాయిలో కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ భాగంలో వర్షాలు కురువలేదు. దీంతో ఒక రోజు ఉన్న నీటి ప్రవాహం ఆ మరుసటి రోజుకు ఉండటం లేదు. ప్రస్తుతం కేవలం తాగు నీటికి మాత్రమే తుంగభద్ర జలాలను విడుదల చేస్తున్నారు.
శ్రీశైలంలో పెరుగుతున్న నీటి మట్టం!
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 215.8 టీఎంసీలు. ఈ నెల 28వ తేదీ 1.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుంకేసుల బ్యారేజీ నుంచి 2.06 టీఎంసీల నీరు చేరింది. గురువారం మధ్యాహ్నానికి 825.20 అడుగుల మట్టంతో 46.82 టీఎంసీల సామర్థ్యానికి నీటి నిల్వలు చేరాయి. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి నారాయణపూర్ డ్యాంకు 1,10,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. నారాయణపూర్ నుంచి 1,11,064 క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతుండగా 12 గేట్లు పైకెత్తి 47,112, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 37,997 క్యూసెక్కుల నీటిని మొత్తం 85,109 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. ఉదయం 67 వేల క్యూసెక్కుల నీరు మధ్యాహ్నానికి 85 వేల క్యూసెక్కులకు చేరింది. నీటి విడుదల మరింత పెరగనుంది. సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం మరో మూడు నాలుగు రోజుల పాటు మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో వర్షాలు భారీగానే కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే తుంగభద్ర డ్యాం ఇన్‌ఫ్లో అంచనాకు అందడం లేదని తెలుస్తోంది.


