కొత్తపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్‌ఐ రామ్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. కొత్తమాడుగుల గ్రామానికి చెందిన ఈడిగ బాలస్వామి గౌడ్(50)కు రెండు ఎకరాల పొలం ఉంది. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. గత రెండేళ్లుగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయాడు. పంటల సాగుకోసం బాలస్వామి గౌడు ఇతరుల వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు భారంతో మానసికంగా కుంగిపోయి తీవ్ర భయాందోళన చెందాడు. ఈ క్రమంలో ఈనెల నెల 28వ తేదీన తాను కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లి గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబీకులు బాలస్వామి గౌడ్‌ను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కర్నూలుకు రెఫర్ చేశారు. అక్కడ ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతిచెందాడు. మృతుడి కొడుకు విక్రమ్ కుమార్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
దైవదర్శనానికి వెళ్తూ ..
సి.బెళగల్: దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సి.బెళగల్ చెందిన రాజు నూతన బొలెరో ట్యాలీ ఆటో కొనుగోలు చేసి బుధవారం మిత్రులు, పరిచయస్తులతో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు శ్రీశైలానికి వెళ్లారు. అయితే దోర్నాల మండలం మెట్లమల్లికార్జునపురం గ్రామం దగ్గర ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు, సి.బెళగల్ వాసులు ప్రయాణిస్తున్న బొలెరో ట్యాలీ ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో తెలుగు గోవిందు (48) అక్కడికికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించి వైద్యం చేయించారు. తెలుగు గోవిందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి గురువారం సి.బెళగల్‌కు తీసుకవచ్చారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


