కర్నూలు: హెడ్ కానిస్టేబుల్ దేవదానంకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కర్నూలులోని స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎన్.శ్రీవిద్య తీర్పు వెలువరించారు. వైఎస్సార్ కడప జిల్లా పద్మావతి కుమారుడు రైల్వే పట్టాలపై మృతిచెందిన ఘటనకు సంబంధించిన కేసులో ఎఫ్‌ఐఆర్ కాపీ ఇంక్వెస్ట్ రిపోర్టు, పోస్టుమార్టం పరీక్ష నివేదిక, ఫైనల్ రిపోర్టు, అనుకూలమైన దర్యాప్తు నివేదికను ఇవ్వడం కోసం 2018లో ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న దేవదానం రూ.9 వేలు లంచం తీసుకుంటుండగా కడప ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కర్నూలులోని ప్రత్యేక న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 13(2), 13(1)డి కింద దేవదానంను దోషిగా నిర్ధారించి ఏడు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.లక్ష జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల సాధారణ కారాగారశిక్ష విధించింది. అలాగే అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 7 కింద దోషిగా నిర్ధారించి ఐదు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 లక్షలు జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల సాధారణ కారాగారశిక్ష విధించింది. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలులో ఉండాలని ఆదేశించారు. అలాగే రూ.3 లక్షలు జరిమానా మొత్తాన్ని ఫిర్యాదుదారుకు పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
పెద్దకడబూరు: హత్య కేసులో నిందితుడు తెలుగు లక్ష్మన్నను అరెస్ట్ చేసినట్లు సీఐ మంజునాథ్, ఎస్‌ఐ మారుతి తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కల్లుకుంట గ్రామానికి చెందిన తెలుగు కార్తీక్(18), తెలుగు లక్ష్మన్న సన్ని హితులుగా ఉండేవారన్నారు.రెండు నెలలుగా కార్తీక్ తనను దూరం పెడుతున్నాడ ని లక్ష్మన్న కక్ష పెంచుకున్నారన్నారు. ఈనెల 23న ఆవును మేపడానికి గౌడప్ప కుంట బీడు పొలాని కార్తీక్ వెళ్లగా పదునైన కత్తితో లక్ష్మన్న పొడినట్లు పేర్కొన్నారు. హతుడి తండ్రి సన్నప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని లక్ష్మన్నను గ్రామంలోని నబిసాబ్ దర్గా వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామయ్య, పోలీసులు చంద్రన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.


