● పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన బాధితులు
● తమ గోడు పట్టించుకోవాలని
అధికారులకు మొర
నాకు ముగ్గురు పిల్లలు సంతానం. అందులో ఇద్దరు చదువుకోరు. రెండోపాప సుమల్య మాత్రం 8వ తరగతి చదువుతోంది. ఈ పాపకు తల్లికి వందనం పడలేదు. చనిపోయిన మా మామ పేరిట మూడు కరెంట్‌మీటర్లు ఉన్నాయని, అందువల్ల తల్లికి వందనం రావడంలేదని సచివాలయ అధికారులు చెబుతున్నారు. గతేడాది వర్తించిన తల్లికి వందన ఈ సంవత్సరం ఎందుకు వర్తించదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. లేకపోతే పాపను కూడా చదువు మాన్పించి పనికి పంపాల్సి వస్తుంది.
– షేక్ షరీఫా, భగత్‌సింగ్‌నగర్, కర్నూలు
తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామ సర్వే నంబర్ 681లో మొత్తం 14.68 ఎకరాల భూమి ఉంది. ఇందులో 11 మంది రైతులు సాగు అనుభవంలో ఉన్నారు. అయితే సున్నపు వెంకటేష్, సున్నపు లక్ష్మీదేవిల పేరిట ఒక్కొక్కరికీ 5 ఎకరాలు చొప్పున మొత్తం 10 ఎకరాలు వారి పేరిటే చేర్చారు. ఇందులో మాకు 2.68 ఎకరాల భూమి ఉండాలి. కాని లేదు. కొందరు అధికారులు డబ్బులు తీసుకొని వారి పేరిట ట్రాన్స్‌ఫర్ చేశారు. వెంటనే సర్వే చేసి అందులో ఉన్న 11 మంది పేరిట ఆన్‌లైన్‌లో భూమి ఎక్కించాలి.
– బారికె ఈశ్వర్, మారెళ్ల, తుగ్గలి మండలం
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు జనం పోటెత్తారు. వివిధ సమస్యలపై అర్జీలు చేతపట్టుకొని బారులు తీరారు. తమ గోడు పట్టించుకోవాలని జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టాగా ఉన్న తమ భూములను ఇనాం, చుక్కలు, 22ఏ కింద చూపుతున్నారని కొందరు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి అనర్హులు చేశారని మరికొందరు, కాటికి కాళ్లుచాపుకుంటున్న తమకు ఇంకెప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తారంటూ ఇంకొందరు, ఇలా వివిధ సమస్యలపై కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు వినతులు అందజేశారు. తిరిగి తిరిగి అలసిపోతున్నామే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని పలువురు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
మేము తండ్రికొడుకులం. మాకు ఉన్న భూ సమస్యను పరిష్కరించమని కలెక్టరేట్‌లో దాదాపు 20 సార్లు ఫిర్యాదు ఇచ్చినా పరిష్కారం చేయడంలేదు. మాకు గ్రామ సర్వే నంబర్ 420లో 8.92 ఎకరాల పొలం ఉంది. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 16.92 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి మా భూమికి సంబంధించి సర్వే చేసి హద్దులు వేయాలని కోరుతుంటే తహసీల్దార్ పట్టించుకోవడంలేదు. కోర్టు ఆదేశాలను కూడా అధికారులు లెక్క చేయడంలేదు. మా సమస్య ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – రాముడు, కృష్ణ, పెద్దనెలటూరు, గోనెగండ్ల మండలం


