నందవరం: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేతలు ప్రకృతి వనరులను కొల్లగొట్టి పైసలు పోగేసుకుంటున్నారు. వాగులు, వంకలు, చెరువులు, గుట్టలు కనిపిస్తే చాలు కొద్ది రోజుల్లోనే ఆనవాళ్లు కోల్పోవాల్సిందే. మండల పరిధిలోని గంగవరం గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిలో చీకటి పడగానే మట్టి మాఫియా వాలిపోతుంది. టీడీపీ నియోజకవర్గ స్థాయి నేత ఆధ్వర్యంలో ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రామంలోని సర్వే నంబరు 114లో 32.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని రాళ్ల గుట్టగా పిలుస్తున్నారు. ఈ రాళ్ల గుట్ట అక్రమార్కులకు కాసులు కురిపించే గనిగా మారింది. రాత్రి 9 గంటల తర్వాత అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. భారీ ప్రొక్లెయినర్లతో తవ్వి, టిప్పర్ల ద్వారా మంత్రాలయంలోని బైపాస్ రోడ్డుకు తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలు టీడీపీ నేత కనుసన్నల్లో జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు 200 ట్రిప్పుల వరకు గ్రావెల్‌ను తరలిస్తునట్లు సమాచారం. ఒక్కొక్క ట్రిప్పు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. అధికార పార్టీ నేత అండదండలు ఉండటంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి.
ప్రమాదకరంగా మారిన గుంతలు..
ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. రైతులు తమ పొలాలకు వెళ్లాంటే ఈ భూమి మీదుగా వెళ్లాలి. అలాగే పాడి రైతులు పశువులను మేత కోసం అటువైపు వెళ్తారు. అక్రమ మట్టి తవ్వకాలు జరగడంతో భారీ గుంతలు ఉండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. వానలు కురిసి గుంతలో నీరు నిలిచి అటువైపుగా పొలాలకు వెళ్లలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు ప్రాణసంకటంగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలపై తహసీల్దార్ అబ్దుల్ వాహాబ్‌ను వివరణ కోరగా.. గంగవరం గ్రామంలోని ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ భూముల్లో తెలుగు తమ్ముళ్ల
చీకటి దందా
అక్రమంగా గ్రావెల్ తరలింపు
టీడీపీ నేతలకు ఆదాయ వనరుగా
మారిన తవ్వకాలు
ప్రమాదకరంగా మారుతున్న గుంతలు


