కరివేన చెరువు ఇక కనుమరుగే! | - | Sakshi
Sakshi News home page

కరివేన చెరువు ఇక కనుమరుగే!

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

వెయ్యి ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం

ఆత్మకూరురూరల్‌: ప్రజలకు దాహార్తి తీర్చే, భూములను సస్యశ్యామలం చేసే కరివేన చెరువు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్న నీటి పారుదలశాఖ పరిధిలోని ఈ చెరువు ప్రమాదపు అంచుల్లో ఉంది. వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించే దీనిని మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అక్కడ అనాలోచిత, అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ చెరువు ఆత్మకూరు మున్సిపాలిటీకి ఆనుకుని ఉంది. పట్టణంలోని పాత ఇళ్లను తొలగించిన సమయంలో వచ్చే వ్యర్థాలను తీసుకు వచ్చి ఇందులో వేస్తున్నారు. దీంతో చెరువు నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోంది. అంతే కాకుండా నీరు కలుషితం అయ్యే అవకాశం నెలకొంది. ప్రస్తుతం నీరు లేకపోవడంతో మందుబాబులు చెరువులో అక్కడక్కడ ఉన్న తుమ్మచెట్ల కింద మద్యం సేవిస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు పగులగొట్టడంతో గాజుపెంకులు కనిపిస్తున్నాయి.

విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు!

వ్యర్థాలతో చెరువును ఓ వైపు నింపుతుంటే మరోవైపు విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. చెరువులో విలువైన మొరుసును (గ్రావెల్‌) అక్రమార్కులు తరలిస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరు నంద్యాల– కల్వకుర్తి 167 జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని చదును చేసేందుకు కరివేన చెరువునుంచే మొరుసును తరలించారు. గ్రామస్తులు ఈ అక్రమ తవ్వకాన్ని అడ్డుకోవడంతో వాళ్లు కాస్త వెనక్కి తగ్గారు. అక్రమార్కులు విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టడంతో చెరువుకు నీటిని తీసుకువచ్చే ఫీడర్‌ ఛానల్‌ ధ్వంసం అయ్యింది. ఇదిలా ఉండగా కల్వకుర్తి – నంద్యాల 167 జాతీయ రహదారి కరివేన చెరువు అలుగును మూసివేస్తూ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ‘సాక్షి’ ఈ అంశంపై ప్రత్యేక వార్త ఇవ్వడంతో స్పందించిన అధికారులు జాతీయహదారి అలైన్‌మెంట్‌ మార్చడంతో చెరువుకు పెద్ద ప్రమాదమే తప్పింది. మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు ఇప్పటికై నా చెరువు వైపు దృష్టి సారించి కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement