నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి తర్వాత అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో చేరారు. మరికొందరు టెక్నికల్ కోర్సులైన పాలిటెక్నిక్, ఐటీఐలలో చేరేందుకు అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం అవగాహన కల్పించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలోని ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) కళాశాలల్లో దాదాపు భారీగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 5 ప్రభుత్వ, 16 ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి డోన్, బేతంచెర్ల, అవుకు, నంద్యాల, శ్రీశైలంలో కళాశాలలు ఉన్నాయి. మొదటి విడతలో ప్రభుత్వ ఐటీఐలలో 1,040 సీట్లకు గాను 325 సీట్లు మాత్రమే భర్తీ కాగా మిగిలిన 715 సీట్ల కోసం రెండో విడతలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రైవేటు ఐటీఐలలో 2 వేల సీట్లకు గాను 7 సీట్లు మాత్రమే భర్తీ కాగా 1993 సీట్లను రెండో విడతలో ఆన్‌లైన్ దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐటీఐ కోర్సులు చదివిన విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రాంగణ ఎంపికల ద్వారా వారికి వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగావ కాశాలు కల్పించడంతో పాటు వివిధ పరిశ్రమలలో అప్రెంటిస్ శిక్షణ కూడా అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐ విద్యార్థులకు పీఎం సర్వసేతు అనే విద్యా విధానం ద్వారా ఆన్‌లైన్ కోర్సులు నిర్వహించి జర్మన్ భాష నేర్పించి వారికి జర్మనీలోని వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా ఐటీఐ కోర్సులతో ఒక చక్కటి బాటను ఏర్పాటు చేసుకోవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఐటీఐ చక్కటి మార్గం. విద్యుత్, రైల్వే, రక్షణ రంగంతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తాయి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు ఉపాధి తప్పకుండా లభిస్తుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ, ఐటీఐల్లో స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ కూడా ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధి సైతం ఐటీఐ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది.
ఉన్నత చదువుకు అవకాశం..
ఐటీఐలో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు బీటెక్‌లో ప్రవేశం పొందొచ్చు.
ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఈ నెలలో అడ్మిషన్ పక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 3వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలలో అదే నెల 4న వెరిఫికేషన్ చేయించుకోవాలి. 6న కౌన్సెలింగ్ నిర్వహించి షెడ్యూల్ వివరాలను విద్యార్థుల మైబెల్ నంబర్‌కు పంపిస్తాం. పదో తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్లు ఉంటాయి.
– ప్రసాదరెడ్డి, ప్రభుత్వ,
ప్రైవేటు ఐటీఐ జిల్లా కన్వీనర్, నంద్యాల
డోన్ ఐటీఐలో కంప్యూటర్ ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థులు
నంద్యాల ఐటీఐలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు
జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ
కళాశాల్లో 3,080 సీట్లు
మొదటి విడతలో
332 సీట్లు మాత్రమే భర్తీ
రెండో విడత ప్రభుత్వ ఐటీఐలో 715, ప్రైవేటులో 1,993 సీట్ల భర్తీకి దరఖాస్తులు
ఆగస్టు 3వ తేదీ వరకు గడువు
కోర్సుల వివరాలు ఇలా..
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ఏడాది, రెండేళ్లకు సంబంధించిన పలు కోర్సులున్నాయి. ఇందులో రెండేళ్లకు సంబంధించి ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మోటర్ మెకానిక్, డ్రాఫ్ట్ మెన్, సివిల్, టర్నర్, మిసినిస్టు కోర్సులున్నాయి. ఏడాదికి సంబంధించి డ్రస్ మేకింగ్, కంప్యూటర్ కోర్సు (కోప) డిజిల్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్ కోర్సులు ఉన్నాయి.


