శ్రీశైలంప్రాజెక్ట్: స్థానిక గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీవీఎస్ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ 22, బైపీసీ 16, సీఈసీ 18, ఒకేషనల్ గ్రూప్‌ల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. నంద్యాల, కర్నూలు, ప్రకాశం, కడప, అన్నమయ్య, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులు అర్హులని తెలిపారు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు కూడా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి కళాశాలలో అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9490957268, 8985229957ను సంప్రదించాలన్నారు.
వరి బస్తాల దొంగలు అరెస్టు
నందవరం: నాగలదిన్నె గ్రామంలో జరిగిన వరి బస్తాల చోరీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గత నెల 6వ తేదీన గ్రామానికి చెందిన రంగయ్య శెట్టికి సంబంధించిన 155 బస్తాల వరి ధాన్యం బస్తాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి గ్రామానికి చెందిన పుల్లారెడ్డి, మన్సుర్, రంగస్వామిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 155 బస్తాల వరి ధాన్యం రికవరీ చేశామని, అలాగే చోరీకి వినియోగించిన ట్రాక్టర్, టెంపోలను సీజ్ చేశామని ఎస్‌ఐ తెలిపారు. ముగ్గురు నిందితులను గురువారం కోర్టులో హాజరు పరుచుగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారన్నారు.
ఆలూరులో చోరీ
ఆలూరు రూరల్: ఆలూరు పట్టణంలో గురువారం సాయంత్రం చోరీ జరిగింది. కోయనగర్ కాలనీలో నివాసం ఉండే బజారప్ప ఇంట్లో దొంగలు చొరబడి రూ.లక్ష దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. వివరాలు..కాలనీలో శుభకార్యం ఉండడంతో ఇంటికి తాళాలు వేసి వెళ్లగా.. కార్యక్రమం ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువా తెరచి ఉండగా..లోపలికెళ్లి చూసి.. అందులో దాచుకున్న రూ.లక్ష నగదు దోచుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించినట్లు ఎస్‌ఐ మన్మథ విజయ్ వివరించారు.
ఓర్వకల్లు: మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణ తరగతులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యదర్శి శ్రీరాములు నాయుడు సూచించారు. గురువారం స్థానిక పొదుపు భవన్‌లో నిర్వహిస్తున్న కమ్యూనిటీ మేనేజింగ్ ట్రైనింగ్ సెంటర్(సీఎంటీసీ)ను ఆయన సందర్శించారు. ఐక్య సంఘం గౌరవ సలహాదారురాలు విజయభారతి అధ్యతన జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని అదనపు సీఈఓ శ్రీరాములు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమాఖ్య బలోపేతానికి కర్నూలు, ఓర్వకల్లులో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓర్వకల్లు శిక్షణ కేంద్రానికి రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి హాజరయ్యారన్నారు. అనంతరం మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్యూట్ బ్యాగ్(జనపనార సంచుల)లను సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కెనెరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే టైలరింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ నంద్యాల, కర్నూలు జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు శ్రీధర్‌రావు, శ్రీధర్‌రెడ్డి, డీపీఎమ్‌లు నవీణ్, రహెమాన్, ప్రభావతి, ఏపీఎంలు శ్రీనివాసులు, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
రిజర్వాయర్‌కు భూములిచ్చే ప్రసక్తేలేదు
● తేల్చిచెప్పిన మీదివేముల గ్రామ రైతులు
ఓర్వకల్లు: ఏపీఐసీసీకి భూములిచ్చే ప్రసక్తే లేదని మండలంలోని మీదివేముల గ్రామ రైతులు తేల్చిచెప్పారు. గురువారం వైఎస్సార్‌సీపీ నాయకులు, కర్నూలు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఏపీఐఐసీ 600 ఎకరాలను సేకరించిందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ కోసమని మరో 230 ఎకరాలకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ కేవలం ఒకే గ్రామాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదన్నారు. తీసుకున్న భూములకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వారిచ్చే పరిహారానికి బయట కొనుగోలు చేయాలంటే కనీసం అర ఎకర కూడ రాదన్నారు. ఇప్పటికై నా గ్రామ రైతుల మనోభావాలను అర్థం చేసుకుని భూములు తీసుకోవాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరారు.


