తీవ్ర వర్షాభావంతో రంగుమారుతున్న పత్తి పంట
పెట్టుబడులు మట్టిపాలు
ఆందోళనలో పత్తి రైతులు
కృష్ణగిరి: తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పశ్చిమ ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తోంది. ఖరీఫ్ ప్రారంభం నుంచి వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోయి వ్యవసాయ బోర్లలోనూ నీరు ఇంకిపోయింది. చెరువుల్లో చుక్క నీరు లేక పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలన్నీ దాదాపుగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. వారం రోజుల క్రితమే మండలంలో ఎండిన వేరుశనగ పంటను రైతులు పశువుల మేతకై నా పనికొస్తుందనే ఆశతో తొలగించారు. ఇప్పుడు పత్తి పంట కూడా తొలగించాల్సిన పరిస్థితి. వర్షం రాకపోదా? పంటలకు జీవం రాకపోదా! అనే ఆశలతో ఉన్న రైతులు ఒక్కసారిగా పంట రంగు మారుతుండటం చూసి ఆశలు అడియాసలయ్యేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసి దాదాపుగా రెండు నెలలు కావొస్తున్నా వర్షం లేకపోవడం, పంటను చీడపీడల నుంచి కాపాడుకునేందుకు మందులతో పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతుందని, రెండు రోజులుగా పంట అక్కడక్కడ రంగు మారుతుండటంతో పత్తిపై ఆశలు వదులుకోవాల్సిందే అన్న సంకేతం అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గతేడాది అధిక వర్షాలకు వైరస్ సోకి పంట దెబ్బతినగా.. ఈ యేడాది కూడా దాదాపుగా 9 వేల హెక్టార్లలో పంట సాగుచేశారు. సాగు చేసినప్పటి నుంచి వర్షం లేక గాలులకు పంట రంగు మారుతుండటంతో ఇక పంటకు పెట్టిన పెట్టుబడులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోకపోతే వ్యవసాయం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


