ఓర్వకల్లు: మండలంలోని గుట్టపాడు సమీపంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఐసీడీసీ) ప్రాజెక్టు పనులను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సెక్రటరీ అమర్‌దీప్ సింగ్ బాటియా పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓర్వకల్లు నోడ్‌లో 2,621 ఎకరాల్లో, కొప్పర్తి నోడ్‌లో 2596 ఎకరాల్లో రాబోయే పరిశ్రమల పనులను గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి కావాలని అమర్‌దీప్ సింగ్ బాటియా ఆదేశించారు. అనంతరం ఓర్వకల్లు నోడ్‌లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలపై చర్చించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) అండ్ మేనిజింగ్ డైరెక్టర్ దినేష్‌కుమార్, ఏపీఐఐసీ ఈడీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఛీప్ ఇంజనీర్ హరిధర్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


