వేదవతి ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు! | - | Sakshi
Sakshi News home page

వేదవతి ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు!

Jul 20 2026 1:38 AM | Updated on Jul 20 2026 1:38 AM

ప్రతిపాదనలు పంపాం

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న వేదవతి ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ప్రాజెక్టును 2028లో పూర్తి చేస్తామని ఒకవైపు చెబుతూనే మరోవైపు భూసేకరణ కోసం పైసా విదల్చడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై సాగునీటి రంగ నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ జరగనిదే ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతారని, వెంటనే నిధులను విడుదల చేసి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పైసా విదల్చని చంద్రబాబు ప్రభుత్వం

వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి 2019లో చంద్రబాబునాయుడే భూమి పూజ చేసి ప్రారంభించారు. అయితే ఆయన అధికారంలో ఉన్నా దానిపై మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. వేదవతి ప్రాజెక్టు కోసం మొత్తం 4819.73 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 20.79 ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. ఇందుకోసం రూ. 1.53 కోట్లను రైతులకు పరిహారం కింద చెల్లించారు. గత ప్రభుత్వ హయాంలో మరో 196.15 ఎకరాల భూసేకరణ కోసం అవార్డును పాసు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.16.87 కోట్లను చెల్లించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంత వరకు పైసా విదల్చలేదు. ఈ క్రమంలో అప్పట్లో ఎకరం రూ.8 లక్షల ప్రకారం రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే అప్పుడు భూమిని తీసుకోకపోవడంతో ఇప్పుడు అదే రేటుకు ఇవ్వమని చెబుతుండడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో భూసేకరణ అంశం ఒక్క అడుగు ముందుకు పడితే మూడు అడుగులు వెనక్కి పడుతోంది.

చిత్తశుద్ధిపై అనుమానాలు

2019లో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు అప్పటి కాంగ్రెస్‌ నాయకుడు, ప్రస్తుతం డోన్‌ టీడీపీ నాయకుడిగా ఉన్న కోట్ల సూర్య ప్రకాస్‌రెడ్డిని తెలుగుదేశంలో చేర్చుకోవడం కోసం హడావుడిగా వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు కోడుమూరు కేంద్రంగా భూమి పూజ చేశారు. తరువాత ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి మాత్రం ఏమి చర్యలు తీసుకోవడంలేదు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయినా రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ.16.87 కోట్ల విడుదల చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఒకేసారి భూసేకరణ కోసం రూ.552 కోట్లు, నిర్మాణానికి రూ.1,998 కోట్లను విడుదల చేసి పూర్తి చేయడంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారు. అయితే ప్రతి ఎన్నికల ముందు మాత్రం చంద్రబాబునాయుడు వేదవతి, గుండ్రేవుల అంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు కూడా చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ ప్రాజెక్టు నిర్మాణం కోసం మాటకై నా నిధులను అడగడంలేదు.

ప్రభుత్వం వేదవతి ప్రాజెక్టును 2028లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ కోసం ప్రతిపాదనలు అడిగింది. ఇప్పటి వరకు కేవలం 20.79 ఎకరాలకు మాత్రమే రూ.1.53 కోట్లకు అవార్డు పాసైంది. మరో 196.15 ఎకరాలకు సంబంధించి రూ.16.87 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 4602.79 ఎకరాలకు సంబంధించి రూ.552 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి డబ్బులురాగానే రైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం.

– ఎం.రామసుబ్బయ్య, స్పెషల్‌ డెప్యూటీ

కలెక్టర్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌యూనిట్‌–4, కర్నూలు

మళ్లీ ప్రతిపాదనలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో వేదవతిని కూడా చేర్చింది. 2028 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పింది. ఈ క్రమంలో భూసేకరణపై మళ్లీ ప్రతిపాదనలు కావాలని ప్రభుత్వం అడిగింది. మొత్తం 4819.73 ఎకరాలకు గాను ఇప్పటికే చెల్లించిన 20.79 ఎకరాలు, 196.15 ఎకరాలు కలుపుకొని మిగిలిన 4,602.79 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రైతులకు ఎకరానికి రూ.12 లక్షలు చెల్లించాలనే ప్రతిపాదనతో ప్రభుత్వానికి నివేదించింది. ఈ లెక్కన 4602.79 ఎకరాలకు మొత్తం రూ.552.34 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని లెక్కగట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే 196.15 ఎకరాలకు రూ.16.87 కోట్లనే చెల్లించలేదు. ఇక ఏకంగా 4602.79 ఎకరాలకు రూ.552.34 కోట్లను ఎప్పుడు చెల్లిస్తుందో వేచి చూడాలి.

పూర్తి కాని భూసేకరణ

నిధులు విడుదల చేయని

రాష్ట్ర ప్రభుత్వం

రూ.552.34 కోట్లు కావాలని

ప్రతిపాదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement