Mantralayam: తిరుగులేని నేతగా బాలనాగిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

Mantralayam: తిరుగులేని నేతగా బాలనాగిరెడ్డి

Jun 5 2024 8:50 AM | Updated on Jun 5 2024 1:32 PM

-

మంత్రాలయం నుంచి

నాలుగోసారి జయకేతనం

మంత్రాలయం: యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి నాల్గవ సారి సైతం విజయ బావుటా ఎగురవేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నటుడు బాలకృష్ణ ప్రచారం చేసినా టీడీపీ అభ్యర్థి ఎన్‌ రాఘవేంద్ర రెడ్డి గట్టెక్కలేకపోయారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం నుంచి మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.బాలనాగిరెడ్డి, టీడీపీ అభ్యర్థి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి మధ్య ప్రధాన పోటీ సాగింది. మంత్రాలయం నియోజకవర్గంలో మొత్తం 2,08,350 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు, 1,02,155 మంది, మహిళలు 1,06,172 మంది , ఇతరులు 23 మంది ఉన్నారు. అందులో 1,76,077 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 84.51 శాతం పోలింగ్‌ నమోదైంది. కర్నూలు జిల్లా కేంద్రంలోని రాయలసీమ యూనివర్సిటీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి. విశ్వనాథ్‌ నేతృత్వంలో ఓట్ల లెక్కింపు సాగింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి కౌటింగ్‌ మొదలైంది. 

17 రౌండ్ల గణన ప్రక్రియ జరిగింది. మొదటి రౌండ్‌లో టీడీపీ 341 ఓట్ల మెజార్టీతో బోణీ చేసుకుంది. తక్కిన రౌండ్లలో వైఎస్సార్‌ సీపీ ఆధిక్యత కొనసాగించింది. 17వ రౌండ్‌ ముగిసిన సమయానికి 12,805 ఓట్ల మెజార్టీతో బాలనాగిరెడ్డి విజయం సాధించారు. మంత్రాలయం నుంచి విజయం సాధించిన వై. బాలనాగిరెడ్డికి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్‌. రాఘవేంద్ర రెడ్డికి 74,857 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి మురళీ కృష్ణంరాజుకు 4,660 ఓట్లు , బీఎస్పీ అభ్యర్థి గుడిపి సామేల్‌కు 3589 ఓట్లు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి ఆర్‌. రాఘవేంద్ర రెడ్డికి 608 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు ఎం. రాఘవేంద్ర రెడ్డికి 624 ఓట్లు, కె. నాగిరెడ్డికి 353 ఓట్లు, సి. పరమేష్‌కు 297 ఓట్లు , నోటాకు 2,674 ఓట్లు వచ్చాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement