● హరితాంధ్రప్రదేశ్ పేరుతో మొక్కల
పంపిణీలో రూ. 40 లక్షలు స్వాహా
● 30 వేల మొక్కలు పంపిణీ
అని ప్రచారం
● మూడు వేల మొక్కలు మాత్రమే
పంపిణీ చేసిన వీఎంసీ
● రూ. 10 నుంచి రూ.50 విలువ చేసే
మొక్క రూ. 160కి కొనుగోలు
పటమట(విజయవాడతూర్పు): హరితాంధ్రప్రదేశ్.. హరితవనం.. ఈ రెండు కార్యక్రమాలు వీఎంసీలో అవినీతికి కల్పతరువుగా మారాయి. ఉచిత మొక్కల పంపిణీ పేరుతో భారీస్థాయిలో అవినీతి పాల్పడేందుకు ఈ కార్యక్రమాలు వేదికలయ్యాయి. విజయవాడ నగరంలో నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతను వేడిని తగ్గించేందుకు మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షించాలని వీఎంసీ చేసిన ప్రచారం చివరికి అవినీతి వేర్లకు చేరుకుంటున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ హార్టికల్చర్ విభాగంలో అవినీతి తాండవిస్తోంది. కొన్న మొక్కల కంటే మరింత రెట్టింపు చేసి బిల్లులు చేసేశారు. హారిత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ హార్టకల్చర్ విభాగం ఈ ఏడాది జనవరిలో వీఎంసీ ఒక్కో సర్కిల్‌కు 10 వేల మొక్కలు చొప్పున మూడు సర్కిళ్లకు 30 వేల పండ్లు, పూల మొక్కలను కొనుగోలు చేశారు. నగరంలో 15 వేల మందికి ఒక పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే వాటిలో 3వేల మందికి మాత్రమే పంపిణీ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలన, స్థానిక కార్పొరేటర్లను, స్వచ్చంద సంస్థలను, డ్వాక్రా సంఘాలు, వాకర్స్ అసోసియేషన్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కూడా భాగస్వాములుగా చేసి వారికి పంపిణీ చేశారు. అయితే ప్రచారం చేసిన విధంగా కాకుండా కేవలం సర్కిల్‌కు వెయ్యి మొక్కల చొప్పున మూడు సర్కిళ్లలో మూడు వేలు మొక్కలు మాత్రమే పంపిణీ చేశారు.
పంపిణీ చేసిన మొక్కలివీ..
పండ్లలో మామిడి, జామ, నిమ్మ మొక్కలు కాగా పూల మొక్కల్లో మల్లి, గులాబీ, మందారం.
తిలాపాపం తలాపిడికెడు...
ఈ వ్యవహారంలో వీఎంసీలో రెండు విభాగాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారు. ఇండెంట్ పెడితేనే టెండర్లు పిలిచామని, టెండర్లు వేసి మొక్కలు అప్పగిస్తేనే పంపిణీ చేశామని ఇటు ఇంజినీరింగ్–హార్టికల్చర్ విభాగాలు ఒకరిపై ఒకరు నెపంనెట్టుకుంటున్నారు. వీటన్నింటికీ బిల్లుల వ్యవహారంలో మాత్రం ఇరువురూ భాగస్వామ్యంగా పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


