ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి..
కారణమిదేనా?
బహిరంగ మార్కెట్లో ఎగబాకుతున్న ఉల్లిపాయల ధరలు
చల్లపల్లి: నిన్నమొన్నటి వరకు రైతుకు గిట్టుబాటు ధర దక్కక కంటతడి పెట్టించిన ఉల్లిపాయ.. ఇప్పుడు సామాన్యుడికి కోయకుండానే కంట కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావటంతో వారం రోజుల వ్యవధిలోనే హోల్‌సేల్ మార్కెట్ నుంచి రిటైల్ మార్కెట్ వరకూ ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఫలితంగా సామాన్యుల వంటింటి బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. నిన్నటి వరకూ కిలో ఉల్లిని రూ.30–40 మధ్య కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రస్తుతం రూ.50–60 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదీ పరిస్థితి..
గత ఏప్రిల్‌లో కర్నూలు మార్కెట్‌లో ఉల్లి క్వింటా ధర రూ.400 నుంచి రూ.1200 మధ్య ఉండగా ఎక్కువ సరుకు రూ.400–600 మధ్య అమ్ముడైనట్లు అప్పటి నివేదికలు చెబుతున్నాయి. సాగు వ్యయంతో పోలిస్తే ఈ ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలా అని వినియోగదారులకు తక్కువ ధరకు వచ్చింది ఏమీలేదు. ఆ సమయంలో రిటైల్ మార్కెట్‌లో రూ.25–30 అధిక ధర చెల్లించి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఉల్లి సరఫరా గణనీయంగా తగ్గటంతో వారం కిందట హైదరాబాద్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర రూ.2,500–3,000 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5,500కు చేరింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.50–55కు చేరింది. నాణ్యత, రకం ఆధారంగా కొన్ని చోట్ల రూ.60 వరకు అమ్ముతున్నారు.
రైతు బజారులోనూ అదే పరిస్థితి!
ధరల పెరుగుదల ప్రభావం రైతు బజార్లపైనా కనిపిస్తోంది. ఈనెల 15వ తేదీన కిలో ఉల్లి ధర రూ.37గా ఉండగా, ఆ తర్వాత రోజురోజుకూ ధర పెరుగుతూ వచ్చింది. 16న రూ.38, అనంతరం రూ.40కు పైగా చేరి 20వ తేదీ నాటికి రూ.45కు, 21వ తేదీన రూ.47కు చేరినట్లు మార్కెట్ ధరలు సూచిస్తున్నాయి. హోల్‌సేల్ షాపుల్లో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రకం, నాణ్యతను బట్టి రూ.48 నుంచి రూ.50 మధ్య ఉండగా, రిటైల్ మార్కెట్‌లో అదే ఉల్లి రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోంది.
ధరల పెరుగుదల తాత్కాలికమే అయితే ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, దీర్ఘకాలిక సరఫరా సమస్య ఉంటే ప్రత్యామ్నాయ మార్కెట్ల నుంచి ఉల్లిని తీసుకువచ్చి ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మార్కెట్‌ను పర్యవేక్షించటంలో, సరఫరాను సమన్వయం చేయటంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? నిల్వదారులు, దళారుల పాత్ర ఏమైనా ఉందా? అనే అంశాలపై కూడా అధికారులు ఆరా తీసి ఉల్లి ధరలను అదుపుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్ వంటి ప్రధాన ఉల్లి ఉత్పత్తి కేంద్రాల నుంచి సరఫరాలో అంతరాయం రావటం, ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఖరీఫ్ సీజన్‌లో ఉల్లిసాగు ఆలస్యంగా వేయటంతో ఉల్లి డిమాండ్‌కు తగ్గట్లు సప్లయి లేకపోవటంతో రోజురోజుకూ ధరలు ౖపైపెకి ఎగబాతున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి.


