మచిలీపట్నం అర్బన్: జిల్లాలో స్వచ్ఛతను మరింత మెరుగుపరిచి, స్వచ్ఛ కృష్ణాగా తీర్చిదిద్దే లక్ష్యంతో శనివారం నిర్వహించనున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ, మునిసిపల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో ఇన్‌చార్జ్ కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, మునిసిపల్ కమిషనర్లు తమ పరిధిలోని సిబ్బందిని సమన్వయం చేసుకుని కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిధిలోని జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించి చెత్త, వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
ఉపరాష్ట్రపతి పర్యటనకు..
ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆయన ప్రయాణించే మార్గానికి ఇరువైపులా ఉన్న గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. రహదారుల వెంట ఎక్కడా చెత్త, వ్యర్థాలు కనిపించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాల పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ నవీన్


