రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సౌత్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ (పీసీఈఈ) తపన్ కుమార్ సిన్హా శుక్రవారం విజయవాడ డివిజన్‌లోని డీజిల్ లోకోషెడ్‌ను తనిఖీ చేశారు. లోకో షెడ్‌లో అనుసరిస్తున్న నిర్వహణ పద్ధతులు, లోపాలను గుర్తించి చేపట్టే నివారణ చర్యలను సమీక్షించారు. అలాగే మెటీరియల్ నిర్వహణ, హౌస్‌కీపింగ్, స్క్రాప్ తరలింపు, సిబ్బంది భద్రత చర్యలను పరిశీలించారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రేక్ విభాగాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడి విధుల్లోని సమస్యలు, సవాళ్లపై వారిని అడిగి తెలుసుకున్నారు. భారతీయ రైల్వే వ్యాప్తంగా డీఈఎంయూలు, టవర్‌కార్లలో ఉపయోగించే లోడ్ కంట్రోల్ కన్సోల్ కార్డుల మరమ్మతులను చేపట్టిన ఏకై న షెడ్ ఇదే కావటం పట్ల సిబ్బందిని ప్రశంసించారు.
సీసీబీ టెస్ట్ బెంచ్ ప్రారంభం..
అనంతరం ఎలక్ట్రికల్ లోకోమోటివ్‌ల కోసం నిర్వహణ, సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఎయిర్ కంప్రెసర్, సీసీబీ టెస్ట్ బెంచ్‌ను పీసీఈఈ ప్రారంభించారు. రైల్వేబోర్డు ఇమ్మార్సివ్ డ్రైవ్ లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన నిర్వహణ, భద్రత, సహజ వనరుల వినియోగంలో సిబ్బంది కృషిని ప్రశంసిస్తూ వారికి నగదు బహుమతిని అందజేశారు. ఈ తనిఖీలలో ఆయనతో పాటు డీజిల్ లోకో షేడ్ డీఎంఈ ఉదయ భాస్కర్, అసిస్టెంట్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ మల్లికార్జునరావు పాల్గొన్నారు.


