జూడాల సమ్మెతో ఖాళీ అవుతున్న ఆస్పత్రి
క్యాజువాలిటీకి వచ్చిన రోగులను
వేరే ఆస్పత్రులకు పంపేస్తున్న వైనం
ఐదో రోజు అత్యవసర సేవలు
బహిష్కరించిన జూడాలు
కొనసాగుతున్న నిరసన దీక్షలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జూడాల సమ్మె ప్రభావం రోగులపై తీవ్రంగా చూపుతోంది. అనారోగ్యంతో క్యాజువాలిటీకి వెళ్లిన రోగులను ఇతర ఆస్పత్రులకు పంపించేస్తున్నారు. అందుకు గురువారం రాత్రి పిన్నమనేని సిద్ధార్థ నుంచి జీజీహెచ్ క్యాజువాలిటీకి వచ్చిన రోగికి, ఇక్కడ చేయలేమని చేతులెత్తేయగా, వాళ్లు అర్ధరాత్రి వేళ మంగళగిరి ఎయిమ్స్‌కు చేరుకున్నారు. అంతేకాదు వార్డులు సైతం రోగులు లేక వెలవెల బోతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపుతామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో రోగుల వైద్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
జూడాలే కీలకం..
బోధనాస్పత్రిలో రోగులకు వైద్యం చేయడంలో జూనియర్ వైద్యుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్యాజువాలిటీలో ఆరు నుంచి పది మంది హౌస్‌సర్జన్‌లతో పాటు, మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ లాంటి విభాగాల్లో పీజీలు సైతం విధులు నిర్వహిస్తుంటారు. రోగి వచ్చిన వెంటనే ఆరోగ్య స్థితిని బట్టి ఆయా విభాగాల వారు వైద్యం చేస్తుంటారు. అంతేకాదు వార్డులో రోగులకు ఇంజెక్షన్స్ చేయడం, క్యాన్‌లా పెట్టడం, సర్జరీలకు రోగులను పోస్ట్ చేయడం, లేబర్ వార్డులోడెలివరీలు వంటి అన్ని పనుల్లో పీజీలే కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లు లేక పోవడంతో కేవలం వైద్యులే అన్ని పనులు చేయాల్సి రావడంతో వైద్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
సమస్యలపై వెనక్కి తగ్గని జూడాలు..
మరోవైపు తమ సమస్యలు పరిష్కరించే వరకూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని జూడాలు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి మూడు డిమాండ్‌లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. దీంతో జీజీహెచ్‌లో జూడాల సమ్మె కొనసాగుతుంది. ఐదో రోజు అత్యవసర సేవలు బహిష్కిరంచిన జూడాలు క్యాజువాలిటీ ఎదుట ఏర్పాటు చేసిన నిరసన దీక్ష శిబిరంలో కూర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏకపక్ష ప్రకటనలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
350 మందికి పైగా విధుల బహిష్కరణ..
ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే 350 మంది వరకూ జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించిన ఆందోళన చేస్తున్నారు. వార్డులో నర్సింగ్ విద్యార్థులు, ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలే సేవలకు దిక్కయ్యారు. డీహెచ్, డీసీహెచ్‌ఎస్ నుంచి వచ్చిన వైద్యులు పూర్తిస్థాయిలో సేవలు అందించలేక పోతున్నారు. దీంతో అంతంత మాత్రంగానే సేవలు అందుతున్నాయి.


