ప్రభుత్వ వైద్యులపై చిన్నచూపు తగదు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యులపై చిన్నచూపు తగదు

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

జీడీఏ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు

బాబ్జి శ్యామ్‌కుమార్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్యులను చంద్రబాబు సర్కారు చిన్నచూపు చూస్తోందని, తమకు రావాల్సిన 2016 యూజీసీ పీఆర్‌సీ బకాయిలు చెల్లించడం సాధ్యం కాదంటూ వైద్యశాఖ కార్యదర్శి మెమో ఇవ్వడమే అందుకు నిదర్శనమని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఐ. బాబ్జి శ్యామ్‌కుమార్‌ అన్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను అడుగుతున్న వైద్యుల పట్ల ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో వైద్యులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.

జేఏసీ ఏర్పాటు..

డాక్టర్‌ బాబ్జి శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాఖలైన డీఎంఈ, డీహెచ్‌, డీసీహెచ్‌ల పరిధిలోని వైద్యులతో కలిసి సమస్యల పరిష్కారం కోసం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి తాను చైర్మన్‌గా, కన్వీనర్‌గా డాక్టర్‌ స్వరూప్‌కాంత్‌, ఉప కన్వీనర్లుగా డాక్టర్‌ అజయ్‌ అనంతుల, డాక్టర్‌ దీపకుమార్‌, డాక్టర్‌ జి. చంద్రశేఖర్‌, డాక్టర్‌ నీలిమ, డాక్టర్‌ సంజీవనాయుడు, డాక్టర్‌ చిరువోలు శ్రీథర్‌ కోశాధికారిగా డాక్టర్‌ సునీల్‌కుమార్‌ నాయక్‌ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కమిటీ ద్వారా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

రోడ్డు భద్రతలో ఆదర్శంగా నిలబడదాం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రోడ్డు భద్రతలో విజయవాడను ఆదర్శ నగరంగా నిలబెట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరం అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో విజయవాడను రోడ్డు భద్రతలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐడియల్‌ టౌన్‌ ఆన్‌ రోడ్‌ సేఫ్టీ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టర్లను లక్ష్మీశ ఆవిష్కరించారు. హోండా ఇండియా ఫౌండేషన్‌ సీఎస్సార్‌ భాగస్వామిగా, ట్రాక్స్‌–రోడ్‌ సేఫ్టీ ఎన్‌జీవో సంస్థ రవాణా, పోలీస్‌ శాఖల సహకారంతో కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు, క్షతగాత్రులను 10–15 శాతం మేర తగ్గించడం, ప్రజల్లో రోడ్డు భద్రతపై బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. హోండా ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధులతో పాటు విజయవాడ–ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌, ట్రాక్స్‌ – రోడ్‌ సేఫ్టీ ఎన్‌జీవో (ఢిల్లీ) జనరల్‌ సెక్రటరీ రజనీగాంధీ, రీజనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఎం. వాసు తదితరులు పాల్గొన్నారు.

ఫొటో జర్నలిజంలో శ్రీనివాస రెడ్డికి అరుదైన గౌరవం

గాంఽధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఫొటోగ్రాఫిక్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా అనుబంధ సంస్థ ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫిక్‌ కౌన్సిల్‌ 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పురస్కారాలు ప్రకటించింది. ఫొటోగ్రఫీ రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని గుర్తిస్తూ ఏటా వివిధ పురస్కారాలతో గౌరవించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది నలుగురు భారతీయ ఫొటో జర్నలిస్టులు అత్యున్నతమైన అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన ఫొటో జర్నలిస్ట్‌ టి. శ్రీనివాసరెడ్డిని తన నాలుగు దశాబ్దాల ప్రయాణంలో సాధించిన విజయాలకు గాను మాస్టర్‌ ఆఫ్‌ ఫొటో జర్నలిజం అనే అత్యున్నతమైన అవార్డుకి ఎంపిక చేసింది.

ఇదీ ప్రస్థానం..

1990లో ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫిక్‌ కౌన్సిల్లో సాధారణ మెంబర్‌గా జాయిన్‌ అయిన శ్రీనివాసరెడ్డి గత రెండు దశాబ్దాలుగా జర్న లిజం, కలర్‌ ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించి అనేక మంది ఔత్సాహికులను ఈ రంగంలో కొనసాగేందుకు తన వంతు కృషి చేశారు. ఫొటోజర్నలిజం ప్రయాణంలో అనేక పత్రికలతో పాటు ఇండియాటుడేకి దీర్ఘకాలంగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ‘స్నాప్స్‌ ఇండియా’ ఫొటో ఏజెన్సీకి ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్‌ ఫొటో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. 1977 దివిసీమ ఉప్పెనపై ఫొటోలు సేకరించి ఓ పుస్తకరూపంలో ప్రచురించారు. డిసెంబర్‌ 24వ తేదీన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి అవార్డును అందుకోనున్నారు. పలువురు ఫొటో జర్నలిస్టులు శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement