నాటి సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటున్న ప్రజలు
మొదట విడత మునిసిపాలిటీల్లో మోగనున్న ఎన్నికల నగారా
ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జీవో విడుదల
సెప్టెంబర్ 25తో ముగియనున్న జెడ్పీ, మండల పరిషత్‌ల పదవీకాలం
నాడు వైఎస్ జగన్ చేపట్టిన జిల్లాల పునర్విభజన ఫలితమే నేడు ఎన్టీఆర్ జిల్లాకు జెడ్పీ చైర్మన్ స్థానం
స్థానిక సమరానికి
సాక్షి, విజయవాడ: ‘స్థానిక’ రణరంగం మొదలుకాబోతోంది. మునిసిపాలిటీలు, జిల్లాపరిషత్‌లు, మండల పరిషత్‌లు, పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ వేగంగా సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలతో పాటు కొత్త పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఏప్రిల్ 4తో ముగియగా.. నాటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం సెప్టెంబర్ 25తో ముగియనుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 9 మునిపాలిటీల్లో పాలకవర్గం గడువు ముగిసింది. బందరు నగరపాలక సంస్థకు సంబంధించి విలీన ప్రాంతాల సరిహద్దులపై కొందరు హైకోర్టు మెట్లెక్కారు. దీనికి సంబంధించి గత మంగళవారం హైకోర్టులో విచారణ జరగ్గా, తుది తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. కోర్టు కేసు క్లియర్ అయితేనే మచిలీపట్నం కార్పొరేషన్‌లో ఎన్నికలు జరుగుతాయి.
పాత జాబితా ప్రకారమే ఎన్నికలు!
ప్రస్తుతం సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుతోంది. అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది. దీంతో ఆలస్యం అవుతుంది గనుక 2025 ఓటరు జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
అన్నీ అక్రమాలే..!
అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాసంక్షేమం గాలికొదిలి.. మట్టి, ఇసుక, గ్రావెల్, మైనింగ్ ఇలా ప్రకృతి వనరులను దోచుకుంటూ ప్రజాకంటక పాలన సాగిస్తోంది. సూపర్‌సిక్స్ హామీలను గాలికొదిలి.. రెండున్నరేళ్లు కావొస్తున్నా ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి హామీల ఊసే లేదు. క్షేత్రస్థాయిలో కూటమి నేతల అవినీతి అక్రమాలకు అడ్డూఅదుపు లేదు. గ్రామాల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. గంజాయి పల్లెలను సైతం చెరబడుతోంది. వీటి గురించి ప్రశ్నించిన వారి గొంతు నొక్కుతూ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా పక్షాన నిలుస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అన్నిరంగాల్లో అవినీతి చక్రవర్తిగా మారిన చంద్రబాబు ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సుపరిపాలనను సైతం జనం గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో, 16వ ఆర్థికసంఘం నిధులు ఎక్కడ వెనక్కి వెళ్లిపోతాయోననే భయంతో అయిష్టంగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలనే ఉద్దేశంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా మరిన్ని రాజ్యాంగబద్ధమైన పదవులు కల్పించవచ్చనే ఉద్దేశంతోనే నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పార్లమెంట్ పరిధిని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువైంది. ఇంతవరకు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉండగా.. ఈసారి ఎన్టీఆర్ జిల్లాకు సైతం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కనుంది. అంతేగాకుండా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ స్థాయి పదవుల వరకు బీసీలకే ప్రాధాన్యం ఇచ్చి, అధికారం ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బీసీల పక్షపాతి అని నిరూపించుకున్నారు. అయితే బీసీలను ఎప్పుడూ ఓట్ల వరకే వాడుకునే చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్‌లో భాగంగా మరోసారి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంటూ కొత్తరాగం అందుకున్నారు. 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా ప్రభుత్వానికి సూచనలు చేయాలంటూ హైకోర్టు సూచించిన విషయం విదితమే.
కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా
నగరపాలక సంస్థ 1 1
మునిసిపాలిటీలు 5 4
జెడ్పీటీసీ స్థానాలు 46 16
ఎంపీటీసీ స్థానాలు 320 260
మొత్తం ఓటర్లు 17,18,255 16,74,995


