ఇబ్రహీంపట్నం: అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి వ్యవసాయానికి సమృద్ధిగా సాగునీరు అందించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో మూడురోజుల పాటు నిర్వహించే జీపు ప్రచార జాత కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నంలో ఆపార్టీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 117 ఎత్తిపోతల పథకాలు ఉంటే వాటిలో 40 పఽథకాలు ఆదిలోనే నిలిపోయాయన్నారు. ఈపథకాలు పూర్తయి ఉంటే సాగు, తాగునీటికి జిల్లాలో కొరత ఉండేది కాదన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో సాగునీటి కోసం కృషి చేసింది దివంతగ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్ మాత్రమే అని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు రైతులు సమస్యలపై పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తారకరామ ఎత్తిపోతల పథకానికి కేవలం రూ.5 కోట్లు కేటాయిస్తే సుమారు 14వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వేదాద్రి, మున్నేరు ప్రాజెక్టులు పూర్తిచేస్తే దాదాపు లక్ష ఎకరాలకు నీరు అందుతుందని స్పష్టం చేశారు. నాలుగు జిల్లాల్లో 2.80లక్షల ఎకరాలకు నీరు అందించే చింతలపూడి ప్రాజెక్టుకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 35 పెండింగ్ ప్రాజెక్టులు రూ.35 వేల కోట్లుతో 2029 నాటికి పూర్తి చేస్తామని గొప్పలు చెప్పడం చంద్రబాబు మానుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గాలేరు, నగరి, గండికోటతో పాటు 44 సాగునీటి ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించి పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.
ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం..
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదోప్రాంతంలో సమస్యలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో పెదవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయి ఏడాదిన్నర అవుతోందన్నారు. కేవలం రూ.2 కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్ట్ పునర్మిర్మాణం అవుందని, అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాలో అనేక ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం అయ్యాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ కోటేశ్వరరావు, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్నీడి యల్లమందరావు, ఏఐవైఐ రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్, జిల్లా రైతు సంఘం నాయకులు పటాపంచల జమలయ్య, సుబ్బారావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
గుజ్జల ఈశ్వరయ్య
ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రాజెక్టులు
పూర్తి చేయాలని డిమాండ్
సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై
జీపు జాత ప్రారంభం


