గాలింపు చర్యలతో
నలుగురిని కాపాడిన పోలీసులు
ఇబ్రహీంపట్నం: విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు కొండపల్లి ఖిల్లాకు వెళ్లి దారి తప్పారు. అడవిలో చిక్కుకు పోయిన వారిని పోలీసులు గుర్తించి సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు గొల్లపూడికి చెందిన షేక్ హర్షద్ ఆలీ, ఆటోనగర్‌కు చెందిన దొండపాటి రుహాల్, యనమలకుదురు యువకుడు కరగాన సురేంద్ర, రామవరప్పాడుకు చెందిన సీహెచ్ రాజేష్ గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో కొండపల్లి ఖిల్లాకు వెళ్లారు. ఖిల్లా ప్రాంతం చూసిన అనంతరం కొద్దిదూరం అడవిలోకి వెళ్లగా అప్పటికి చీకటి పడి వెళ్లిన దారి మర్చిపోయారు. ఎంతసేపు వెతికినా కిందికి వచ్చే మార్గం కనిపించకపోవడంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. వారి సమాచారంతో సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ రాజు సిబ్బందితో అడవిలో కేకలు వేస్తూ ఎట్టకేలకు వారి ఆచూకీని కనుగొని సురక్షితంగా కిందకు దించారు. సీఐ రాత్రి 11 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో వారి నివాసాలకు యువకులను తరలించారు.
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళలు రైజ్ కేంద్రంలో పొందుతున్న శిక్షణ, నైపుణ్యాలతో వివిధ ఉత్పత్తులను తయారు చేసి, మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మండలంలోని గుంటుపల్లి రైజ్ కేంద్రంలో నిర్వహించిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ మినీ ఎక్స్‌పోను ఢిల్లీ నుంచి వచ్చిన ఓడిఓపి అధికారి ఇషాదీప్ సింగ్‌తో కలిసి శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళ తనకంటూ ఒక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని స్వశక్తితో ఎదగాలన్నారు. మహిళ ఆర్థికంగా బలపడినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలిపారు. మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఏదో ఒక పనిని ఉపాధిగా చేపట్టి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ పొందిన మహిళలు శిక్షణతో ఆగిపోకుండా, తమ నైపుణ్యాలను ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్ తదితర అంశాలతో అనుసంధానం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, రైజ్ మేనేజర్ బి.తేజస్విని, మహిళలు పాల్గొన్నారు.
ఉంగుటూరు(గన్నవరం): ఆర్‌ఎంపీ ఇంట్లో దొంగలు చొరబడి సుమారు రూ.25 లక్షల విలువైన సొత్తును అపహరించుకుపోయిన ఘటన మండలంలోని ఉంగుటూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... గ్రామానికి చెందిన నల్లూరి రామకృష్ణచార్యులు ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఆయన షష్టిపూర్తి వేడుకలను జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కుంకుమ నోము నిమిత్తం గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇంటికి తాళం వేసి గ్రామంలో ప్రతి గడపకు పసుపు, కుంకుమ ఇచ్చేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకుని దైనందిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిద్రించారు. వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు శుక్రవారం తెల్లవారుజామున లేచి బెడ్‌రూమ్‌లోని కప్‌బోర్డులో భద్రపరిచిన బంగారు, వెండి వస్తువులను తీసుకువచ్చేందుకు వెళ్లగా కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకున్న రామకృష్ణచార్యులు దంపతులు ఉంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 170 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి వస్తువులు చోరీ జరిగినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యు.గోవిందు తెలిపారు. చోరీ జరిగిన ఇంటిని గన్నవరం సబ్ డివిజన్ డీఎస్సీ కె.ధర్మేంద్ర, సీఐ బి.వి.శివప్రసాద్, సీసీఎస్ సీఐ గోవిందరాజులు సందర్శించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్‌ను కూడా రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు.


