జనసేనలో మేయర్‌ ముసలం! | - | Sakshi
Sakshi News home page

జనసేనలో మేయర్‌ ముసలం!

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

జనసేనలో మేయర్‌ ముసలం! మేయర్‌ అభ్యర్థిగా డీసీఎంఎస్‌ చైర్మన్‌ బండి రామకృష్ణ పేరు తీర్మానం అప్పుడో మాట.. ఇప్పుడో మాటా?

మేయర్‌ అభ్యర్థిగా డీసీఎంఎస్‌ చైర్మన్‌ బండి రామకృష్ణ పేరు తీర్మానం

విభేదించిన మాజీ

కౌన్సిలర్‌ కొట్టే వెంకట్రావు

పవన్‌ పుట్టిన రోజు సన్నాహక

సమావేశం పేరుతో మేయర్‌ తీర్మానమా?

ఎవరినీ సంప్రదించకుండా ఏకగ్రీవ

తీర్మానం ఎలా చేస్తారని కొట్టే ప్రశ్న

మచిలీపట్నంటౌన్‌: మచిలీపట్నం మేయర్‌ పదవి వ్యవహారం జనసేన పార్టీలో ముసలానికి దారితీసింది. డీసీఎంఎస్‌ చైర్మన్‌, నియోజకవర్గ ఇంఛార్జ్‌ బండి రామకృష్ణను మేయర్‌ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తూ.. కొంతమంది ఆ పార్టీ శ్రేణులు సంతకాల సేకరణ చేపట్టడం ముసలానికి కారణమైంది. ఈ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతామని ప్రకటించటం పట్ల మాజీ కౌన్సిలర్‌, జనసేన నేత కొట్టే వెంకట్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఏకగ్రీవం ఎక్కడ జరిగింది? కొంతమంది మాత్రమే సంతకాలు చేస్తే.. దానిని పార్టీ మొత్తం ఏకగ్రీవ నిర్ణయంగా ఎలా చూపిస్తారు? అంటూ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట్రావు ప్రశ్నించారు. మేయర్‌ పదవికి సంబంధించి ఇంకా చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉందని, అందరి అభిప్రాయం తీసుకోకుండానే హడావిడిగా తీర్మానం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు వేడుకల కార్యక్రమ సన్నాహక సమావేశంలో మేయర్‌ పదవికి సంబంధించిన తీర్మానం రాసుకుని సంతకాల సేకరణ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని కొట్టే వెంకట్రావు నిలదీశారు. గతంలో టీడీపీలో పనిచేసిన తనను జనసేనలోకి తీసుకువచ్చే సమయంలో తన రాజకీయ అనుభవం, ప్రజల్లో ఉన్న ఆదరణను గుర్తించి మేయర్‌ పదవికి తగిన అర్హత కలిగిన వ్యక్తిగా నమ్మించారని తెలిపారు. జనసేన సిద్ధాంతాలను నమ్మి పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు మాట మార్చడం ఎందుకని ప్రశ్నించారు. ‘‘నాపై నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఒక మాట.. ఇప్పుడు మరో మాట ఎందుకు?’’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021లో టీడీపీ మేయర్‌ అభ్యర్థ్ధిగా తాను, తన భార్య జయలక్ష్మి పోటీ చేశామని గుర్తు చేశారు. మేయర్‌ పదవిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ముందు ఎంపీ బాలశౌరితో, పార్టీ అధిష్టానంతో చర్చించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తనకు రాజకీయ అనుభవంతో పాటు మున్సిపాలిటీ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉందని, ప్రజల్లో తనకు ఆదరణ ఉందని పేర్కొన్నారు. మేయర్‌ పదవి కోసం కొంత మంది సంతకాలు చేశారనే కారణంతోనే నిర్ణయం ఖరారైపోయిందా? లేక ఇంకా అందరి అభిప్రాయాలు తీసుకుంటారా? ఇదే ఇప్పుడు మచిలీపట్నం జనసేనలో ప్రధాన ప్రశ్నగా మారింది. మేయర్‌ పదవిపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు బయటపడటంతో.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే కూటమి ధర్మాన్ని పాటించకుండా జనసేన నాయకులు ఏకపక్ష తీర్మానాలు చేయటంను టీడీపీ నేతలు సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. వచ్చే మేయర్‌ ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు లేకుంటే పోటీకి ఇరుపార్టీలు సై అంటాయనే వాదనలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆ రెండు పార్టీల అధిష్టానాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement