మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రీబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి తెలిపారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయిని, మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలియజేశారు. అభ్యర్థులు ఒరిజినల్ హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో ఫేస్ వెరిఫికేషన్, మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు చేస్తామని,మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, ఇతర ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు పరీక్ష జరిగే హాలులోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ దళారులు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని, ఏపీసీపీడీసీఎల్ నుంచి జారీ చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే అభ్యర్థులు విశ్వసించాలని సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు.
మైలవరం: మైనర్ బాలికను వేధిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సాయిరి ఆనందబాబు ఏడాది కాలంగా పాఠశాల, ట్యూషన్, ఇంటికి వెళ్ళే సమయంలో ఓ మైనర్ బాలికనుల ద్విచక్రవాహనంపై వెంబడిస్తున్నాడు. ప్రేమ పేరుతో వేధించి, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాలిక నిరాకరించినప్పటికీ నిందితుడు తన ప్రవర్తన మార్చుకోకుండా వెంటపడుతూ వేధింపులు కొనసాగించాడు. గ్రామ పెద్దల సమక్షంలో హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడంతో గతంలోనే బీఎన్‌ఎస్, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో పై విషయం వాస్తవమేనని తెలిసింది. దర్యాప్తులో భాగంగా నిందితుడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్‌లు, నేరానికి ఉపయోగించిన కత్తి, బాలికను వెంబడించడానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కేసు ప్రాపర్టీగా సీజ్ చేశారు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


