సెప్టెంబర్ 3వ తేదీలోగా ఓటర్ల జాబితా ప్రకటించే అవకాశం కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వార్డులు పెంపునకు ప్రభుత్వ ఆమోదం విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు, కొన్ని మునిసిపాలిటీల్లో డీలిమిటేషన్‌పై కోర్టు కేసులు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని చెప్పకనే చెప్పిన డెడికేటెడ్ కమిషన్
సాక్షి, విజయవాడ: పురపోరుకు సన్నద్ధాలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలో ఉండగానే కార్పొరేషన్లతో పాటు మునిసిపాలిటీల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతో పాటు తొమ్మిది మునిసిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో డివిజన్లు, వార్డులు పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు జగ్గయ్యపేట, పెడన మునిసిపాలిటీలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటంతో డివిజన్లు, వార్డుల పెంపు వాయిదా పడింది. గుడివాడ మునిసిపాలిటీలో ఐదు గ్రామాలను విలీనం చేసి, వార్డులను 36 నుంచి 41 లేదా 42 వార్డులుగా చేయాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన చేయగా అప్పడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో గతంలోనే మునిసిపల్ ఎన్నికలు జరగలేదు. పలు గ్రామాలను విలీనం చేసి 38 వార్డులతో తాడిగడపను మునిసిపాలిటీగా ఏర్పాటు చేయగా, దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు జరగలేదు. ఆ కోర్టు కేసు తేలేవరకు ఎన్నికలు జరిగే అవకాశం లేదని సమాచారం. కోర్టు కేసులు పరిష్కారమైతే విజయవాడలో డివిజన్ల సంఖ్య 64 నుంచి 86కు, మచిలీపట్నంలో 50 నుంచి 60కి చేరుతుంది. విజయవాడలో డివిజన్ల పెంపుపై అభ్యంతరాలు తెలుపుతూ మాజీ కార్పొరేటర్ కోర్టులో కేసు వేశారు. మచిలీపట్నంలో డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీఓలో సరిహద్దులు కూడా సూచించింది. అయితే మునిసిపల్ అధికారులు రాజకీయ ప్రోద్బలంతో అధికార పార్టీకి అనుకూలంగా సరిహద్దులు నిర్ణయించారు. దీనిపై మాజీ కార్పొరేటర్లు కొందరు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ కేసు మంగళవారం విచారణకు రానుంది. కేసు పరిష్కారమయితే డివిజన్లు పెరుగుతాయి. మరోవైపు వార్డుల పెంపుతో మునిసిపాలిటీల్లో ఆశావహులు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే నెల మూడో తేదీలోగా ముసాయిదా తుది జాబితా ప్రకటించనున్నారు. అంటే 16 రోజులు మాత్రమే గడువు ఉంది. ఎన్నికల కమిషన్ నుంచి కూడా స్థానిక, కార్పొరేషన్, మునిసిపల్ అధికారులకు ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ఉత్తర్వులు అందాయి. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది.
మేయర్, చైర్మన్లను
ప్రత్యక్షంగా ఎన్నుకునే యోచన
కార్పొరేషన్లతో పాటు మునిసిపాలిటీల్లో ఇంత వరకు కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు కలిసి మేయర్ లేదా మునిసిపల్ చైర్మన్లను ఎన్నుకునేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి మేయర్, చైర్మన్‌ను ఓటర్ల ద్వారానే ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశ పెట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మునిసిపల్ చట్ట సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టారు. 2005 ముందు వరకు ఈ ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ఉంది. 2005లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మేయర్/మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకునే పద్ధతి అమల్లోకి వచ్చింది. మరోవైపు 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఇప్పుడు జాబితా రూపొందనుంది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు లేనట్టే !
గత ఎన్నికల సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు రెండేళ్లు దాని గురించి పట్టించుకోలేదు. బీసీల నుంచి పదే పదే 34 శాతం డిమాండ్ రావ డంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఆ కమిటీ కూడా రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే సుప్రీంకోర్టు నిబంధనను ఉటంకిస్తూ 34 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. ఒక వేళ 34 శాతం రిజర్వేషన్ చేస్తే 55 శాతం అవుతుంది. అప్పుడు ప్రత్యేకంగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు పెచడం ఇష్టం లేకనే డెడికేటెడ్ కమిషన్‌తో 34 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని చంద్రబాబు చెప్పించారనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు ఎప్పటిలాగే బీసీలను వాడుకుని వదిలేస్తారనే నిజం మరోసారి సుస్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


