లబ్బీపేట(విజయవాడతూర్పు): జూనియర్ డాక్టర్లు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వారం రోజులుగా సాధారణ సేవలు జూనియర్ వైద్యులు బహిష్కరించారు. సోమవారం నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. దాదాపు 350 మంది విధులను బహిష్కరించడంలో అన్ని విభాగాల్లో సేవలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో జీజీహెచ్‌లో వైద్య సేవలు స్తంభించాయి. వార్డుల్లో ఉన్న రోగులకు ఇంజక్షన్ చేసే వారే కరువయ్యారు. స్టైపెండ్ పెంచాలని, టీచింగ్ వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంచొద్దని, నాన్ మెడికల్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా భర్తీ చేయొద్దని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.
జూడాల సేవలే కీలకం
బోధనాస్పత్రుల్లో రోగులకు సకాలంలో వైద్యం అందడంలో జూనియర్ డాక్టర్ల సేవలు అత్యంత కీలకం. క్యాజువాలిటీ, లేబర్ వార్డుల్లో విధులు నిర్వహించే హౌస్‌సర్జన్, పీజీలకు మంచినీళ్లు తాగేందుకు కూడా సమయం ఉండదు. జూడాలు అత్యవసర సేవలు బహిష్కరించిన తొలిరోజే రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓపీల్లోని వైద్య సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఎక్కడ చూసినా రోగులు బారులుతీరి కనిపించారు. ఆస్పత్రి ఓపీ బ్లాక్ బయట బారులు తీరి ఉండటం కనిపించింది. క్యాజువాలిటీలో బెడ్‌లు రోగులతో నిండిపోయినా వారికి వైద్య సేవలు అందించే వారు కనిపించడం లేదు.
నిరంతరం మానిటరింగ్
జూడాల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఇద్దరు డీసీఎస్ ఆర్‌ఎంఓలు ఓపీలు, వార్డులను సందర్శిస్తూ, వైద్య సేవల్లో ఇబ్బందులు తెలుసుకుంటున్నారని, ఇప్పటి వరకూ వైద్య కళాశాల నుంచి నాన్ క్లినికల్ వైద్యులు పది మంది, డీసీహెచ్‌ఎస్ నుంచి ముగ్గురు వైద్యులు విధులు నిర్వహిస్తున్నా రని వివరించారు. టీచింగ్ వైద్యులు ఆదివారం కూడా సెలవు లేకుండా ఏడు రోజలు పనిచేయాలని నిర్ణయించారని, ప్రతి విభాగానికి నోడల్ అధికారు లను నియమించి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.


