బాలల హక్కుల పరిరక్షణలో సమన్వయం కీలకం | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల పరిరక్షణలో సమన్వయం కీలకం

Aug 6 2026 7:56 AM | Updated on Aug 6 2026 7:56 AM

బాలల హక్కుల పరిరక్షణలో సమన్వయం కీలకం

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు గాంధీబాబు

మచిలీపట్నంఅర్బన్‌: బాలల హక్కుల పరిరక్షణలో ఆయా ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు వి.గాంధీబాబు సూచించారు. పిల్లల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని తమ ఉమ్మడి బాధ్యతగా భావించి సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాల్లో కమిషన్‌కు పూర్తి అవగాహన ఉందని, వాస్తవాలనే తెలపాలని అధికారులకు సూచించారు. బడి బయట పిల్లలు, పాఠశాలల్లో పరిశుభ్రతపై గాంధీబాబు ఆరా తీశారు. జిల్లాలో బడి బయట పిల్లల వివరాలు, వారిని తిరిగి పాఠశాలల్లో చేర్చేందుకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసు కున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్ల పనితీరుపై కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రశ్నించారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించకపోవడం కూడా బాలల హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిల్లో కన్వర్జెన్సీ కమిటీలను సక్రమంగా ఏర్పాటు చేసి సభ్యులందరూ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. బాలల హోమ్స్‌ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పిల్లల భద్రత పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని హెచ్చరించారు. హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచాలని సూచించారు. ఈ సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, శిశు సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, జువైనెల్‌ జస్టిస్‌ చట్టం అమలు తీరుపై ఐసీడీఎస్‌, విద్య, వైద్యం, పోలీసు, కార్మిక, గ్రామీణ నీటి సరఫరా, బీసీ, ఎస్సీ సంక్షేమ, గ్రామ/వార్డు సచివాలయాల శాఖల పనితీరును సమీక్షించారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా అధికారి సహా కొందరు గైర్హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కమిషన్‌ సభ్యుడు చల్లా మధుసూదనరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, డీఆర్‌ఓ కె. శ్రీధర్‌రెడ్డి, ఏఎస్పీ వి.వి.నాయుడు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ సువార్త, ఐసీడీఎస్‌ పీడీ ఐ.విమల, డీఈఓ యు.వి.సుబ్బారావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ దయాకర్‌, వివిధ శాఖల అధికారులు, సంక్షేమ వసతి గృహాల అధికారులు, సీడీపీఓలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement