రౌడీరాజ్యం! | - | Sakshi
Sakshi News home page

రౌడీరాజ్యం!

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

రౌడీరాజ్యం! శాంతియుత నిరసనపై పచ్చగ్యాంగ్‌ ‘బొండా’గిరి

శీల పరీక్షలో నెగ్గేందుకే దాడి..

శాంతిభద్రతలు క్షీణించాయి..

శాంతియుత నిరసనపై పచ్చగ్యాంగ్‌ ‘బొండా’గిరి

అన్ని అనుమతులున్నా

అమానుషంగా దాడి

కోడి గుడ్లు, టమాటాలు,

మూత్రంతో దమనకాండ

స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి దాడికి

ఉసిగొల్పిన వైనం

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును

ఈడ్చిపారేసిన పోలీసులు

సాక్షిప్రతినిధి, విజయవాడ/గాంధీనగర్‌: విజయవాడలో రౌడీరాజ్యం నడుస్తోంది. శాంతి యుతంగా నిరసన దీక్షలు చేస్తున్న వారిపై దాడి చేసి కొత్త సంస్కృతికి తెరలేపారు. ఈ దాడుల్లో ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడ ముత్యాలంపాడులోని గవర్నమెంట్‌ ప్రెస్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరంపై టీడీపీ గూండాలు దాడికి దిగారు.

ఎమ్మెల్యే బొండా తానే స్వయంగా..

ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేరుగా కార్యకర్తలతో దీక్షా శిబిరం వద్దకు చేరుకుని దాడికి పాల్పడ్డారు. ఆయనే స్వయంగా షామియానా పీకేయడంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. శిబిరంలో దీక్షకు కూర్చున్న మల్లాది విష్ణుతో పాటు కార్యకర్తలపై కోడిగుడ్లు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. కార్యకర్తలు, నాయకులపై కుర్చీలు విసిరారు. దాడిలో పలువురు కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. శిబిరంపై దాడిచేస్తున్న సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా అక్కడే ఉండి కార్యకర్తలను రెచ్చగొట్టారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి శిబిరంపై దాడి చేస్తున్నా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. దాడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులను వదిలివేసి.. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను చెల్లా చెదురు చేసేందుకు ప్రయత్నించారు. కొంత మంది కార్యకర్తలను శిబిరం నుంచి లాగిపడేశారు. శిబిరం వైపు దూసుకువస్తున్నా.. వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదు. శాంతియుతంగా నిరాహార దీక్షలో కూర్చున్న మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. వాహనంలో ఎక్కిన తర్వాత కూడా పోలీసు సిబ్బంది ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అక్కడ నుంచి మల్లాది విష్ణును అలంకార్‌ సెంటర్‌లోని ధర్నాచౌక్‌కు తరలించారు. అక్కడ వాహనంలోనే కూర్చుని ఆయన నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆ పార్టీ కార్యకర్తల దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు.

దాడిని ఖండించిన వైఎస్సార్‌ సీపీ

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై దాడిని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణకుమార్‌, ఎండీ రుహుల్లా, మాజీ డెప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజ, అవుతు శ్రీనివాసరెడ్డి, బండి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్‌, ఎండీ గౌస్‌ మొహిద్దీన్‌ తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే బొండా ఉమా తన శీల పరీక్షలో నెగ్గేందుకు మల్లాది విష్ణుపై దాడి చేశారు. టీడీపీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న ఉమా చిట్టా అంతా అధినేత చంద్రబాబు ముందు పెట్టారు. తాను టీడీపీలోనే ఉన్నానని నిరూపించుకునేందుకు గుండాలు, రౌడీలు మాదిరి ఇలాంటి చేతగాని పనులు చేస్తున్నారు. దమ్ముంటే మేం అడుగుతున్న డీఎస్సీ అక్రమాలపై మాట్లాడాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి, నిరుద్యోగ భృతి అమలు చేయాలి. వాటికి సమాధానం చెప్పడం లేదు. వందలమందిని తీసుకొచ్చి మందు పోయించి దాడి చేయిస్తే ఏమవుతుంది? రేపు అనే రోజు మాది కాదా? మా ప్రభుత్వం రాదా? మీకు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

– దేవినేని అవినాష్‌,

వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లక్ష్యంగా కోడిగుడ్లతో దాడికి దిగడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. ప్రభుత్వ హామీలు, డీఎస్సీ అక్రమాలపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ఈ భౌతిక దాడులు చేస్తున్నారు. యువత, విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్‌ సీపీ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే రౌడీయిజం చేయడం సరికాదు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి. వైఎస్సార్‌సీపీ నేతలపై భౌతిక దాడులు చేస్తూ రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ను నడుపుతున్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి.

– వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement