ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 12వ తేదీతో ఆషాఢ మాసోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. 12వ తేదీ ఆలయ అధికారులు, సిబ్బంది అమ్మవారికి సారె సమర్పించాలని నిర్ణయించుకున్నారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆషాఢ మాసం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పెద్దఎత్తున భక్తులు సారెను సమర్పించారు. బంధువులు, స్నేహితులు, గ్రూప్ హౌస్, అపార్టుమెంట్ వాసులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి సారె సమర్పించారు. కనకదుర్గ నగర్, పాత మెట్ల మార్గం, మహామండపం లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి చేరుకుంటున్న భక్త బృందాలు ప్రధాన ఆలయంలో మూల విరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని దర్శించుకుని సారెను సమర్పిస్తున్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. సారె సమర్పించిన భక్తులు మహామండపం రెండు, మొదటి అంతస్తులలో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
సారె సమర్పించిన 39 బృందాలు
గురువారం 23వ రోజున సుమారు 39 బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన భక్త బృందాల రాక సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం 16,231 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.


