నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆదిదంపతులు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై బుధవారం నుంచి ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 7గంటలకు ప్రధాన ఆలయంలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా మహామండపం ఆరో అంతస్తుకు తీసుకువస్తారు. ఆరో అంతస్తులో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఉదయం 7.30 గంటలకు ఆలయ అర్చకులు ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి తొలి సారెను సమర్పిస్తారు.
రూట్ ప్లాన్ ఇదే..
సారె సమర్పణలకు వచ్చే భక్తులు ఘాట్‌రోడ్డు, మహామండపం ద్వారా కొండపైకి చేరుకుంటే తొలుత ప్రధాన ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఆరో అంతస్తుకు చేరుకుని ఉత్సవ మూర్తి వద్ద సారెను సమర్పించి పూజలు జరిపించుకునేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అమ్మవారికి సారె సమర్పించిన పిమ్మట భక్తులు తమతో తెచ్చిన పండ్లు, మిఠాయిలు, ఇతర పూజా సామగ్రిని తొటి భక్తులకు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక ఈ కార్యక్రమం అంతా అయిన అనంతరం భక్తులకు మహామండపం రెండు, మొదటి అంతస్తుల్లో జరిగే ఉచిత అన్న ప్రసాద వితరణకు పంపుతారు. అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు నేరుగా కనకదుర్గనగర్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
ఆరో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు
ఇక ఆరో అంతస్తులో భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులందరూ ఒక వరస క్రమంలో కూర్చునేలా రోప్‌లను ఏర్పాటు చేసింది. అమ్మవారికి సమర్పించే పూజా సామగ్రి కోసం వేదిక ఎదుట ప్రత్యేకంగా బల్లలు ఏర్పాటు చేసింది. సారెలో భాగంగా అమ్మవారికి సమర్పించే ప్రతి చీరకు తప్పని సరిగా రశీదు ఇచ్చేలా దేవస్థానం కౌంటర్‌ను, సిబ్బందిని నియమించనుంది.
మొబైల్‌ఫోన్లు, కెమెరాలతో నో ఎంట్రీ
ఈ దఫా మొబైల్‌ఫోన్లు, కెమెరాలతో ఆలయంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులను అనుమతించమని దేవస్థాన అధికారులు పేర్కొంటున్నారు. కనకదుర్గనగర్‌లోనే భక్తుల లగేజీ, చెప్పులు, సెల్‌ఫోన్లను భద్రపరిచేందుకు వేరు వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. ఆలయ ప్రాంగణం, ఆరో అంతస్తులో సెల్‌ఫోన్ కలిగిన భక్తుల నుంచి వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తామని ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


