నిత్యావసరాల ధరలు ౖపైపెకి.. మెస్ చార్జీలు మాత్రం అంతంతే.. రెండేళ్లుగా పాత రేట్లతోనే సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ రోజుకు రూ.38తో పౌష్టికాహారం సాధ్యమేనా? 4,492 మంది పేద విద్యార్థులపై ప్రత్యక్ష ప్రభావం
చిన్నచూపు ఎందుకు?
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న హాస్టళ్లలో మెస్ చార్జీలు మాత్రం యథాతథంగా కొనసాగిస్తోంది. గత రెండేళ్లలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పుధాన్యాలు, వంటనూనె, గ్యాస్ సిలెండర్ ధరలు అమాంతం పెరిగినా, మెస్ చార్జీలను మాత్రం ఇప్పటికీ సవరించలేదు. మరోవైపు వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రచారం చేస్తోంది. ఇదెలా సాధ్యమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి.
పౌష్టికాహారం ఎలా సాధ్యం..
వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఒక విద్యార్థికి సమతుల్య పౌష్టికాహారం అందించాలంటే రోజుకు కనీసం రూ.100 నుంచి రూ.140 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న మెస్ చార్జీలు ఆ మొత్తానికి సగం కూడా చేరని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యక్ష ప్రభావం పడుతున్నా మెస్ చార్జీల సవరణపై ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.
2023 తర్వాత పెంపు లేదు..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో చివరి సారిగా మెస్ చార్జీలను పెంచింది. అప్పట్లో ప్రీ–మెట్రిక్ వసతి గృహాల్లో 3, 4వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,000 నుంచి రూ.1,150కు, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.1,250 నుంచి రూ.1,400కు, పోస్ట్–మెట్రిక్ విద్యార్థులకు రూ.1,450 నుంచి రూ.1,600కు పెంచింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మెస్ చార్జీలను సవరించలేదు. 2023లో రూ.835 ఉన్న వంట గ్యాస్ సిలెండర్ ధర ప్రస్తుతం రూ.970కు చేరగా, కంది పప్పు ధర రూ.110 నుంచి రూ.160కు, వంట నూనె ధర రూ.130 నుంచి రూ.173కు పెరిగింది. కూరగాయలు, మసాలా దినుసులు, ఇతర ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగాయి. మరి ఇంత వ్యత్యాసంతో విద్యార్థులకు పౌష్టికాహారం ఎలా సాధ్యం?
రోజువారీ ఖర్చు..
ప్రస్తుతం ప్రభుత్వం 3, 4వ తరగతి విద్యార్థికి నెలకు రూ.1,150 మాత్రమే అందిస్తోంది. అంటే రోజుకు కేవలం రూ.38.33 మాత్రమే ఆహారానికి ఖర్చు చేసే పరిస్థితి ఉంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.1,400 చొప్పున, అంటే రోజుకు రూ.46.66 మాత్రమే లభిస్తోంది. పోస్ట్–మెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ.1,600 చొప్పున, అంటే రోజుకు రూ.53.33 మాత్రమే మెస్ ఖర్చు కేటాయిస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరలకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
పెంపు కోసం ఎదురుచూపులు..
వేలాది మంది విద్యార్థుల ఆహార బాధ్యతను నిర్వర్తిస్తున్న వసతి గృహాలకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో పాత మెస్ చార్జీలే కొనసాగడం నిర్వహణపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెస్ చార్జీలతో పాటు కాస్మెటిక్ చార్జీలను కూడా ప్రభుత్వం పునఃసమీక్షించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నా, ప్రభుత్వ వసతి గృహాల మెస్ చార్జీలను రెండేళ్లుగా పెంచకపోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న మెస్ చార్జీలు ప్రస్తుత ధరలకు ఏమాత్రం సరిపోవు. ఈ మొత్తంతో విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడం అసాధ్యం. కనీసం అన్ని వసతి గహాల విద్యార్థులకు నెలకు రూ.3,000 మెస్ చార్జీలు మంజూరు చేసి, కాస్మెటిక్ చార్జీలను కూడా పెంచాలి. విద్యార్థుల ఆరోగ్యం, విద్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మెస్ చార్జీల సవరణపై నిర్ణయం తీసుకోవాలి.
– ఎస్. సమరం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి


