వైఎస్‌ జగన్‌ కృషి ఫలితం.. వైద్య విద్యకు వరం | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ కృషి ఫలితం.. వైద్య విద్యకు వరం

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరు

మూడేళ్ల కిందటే 250 సీట్లకు అనుగుణంగా భవనాల నిర్మాణం

అందుకోసం రూ.90 కోట్లు వెచ్చించిన నాటి సర్కారు

గతంలో సూపర్‌ స్పెషాలిటీ సీట్లు మంజూరు

గతంలో సూపర్‌ స్పెషాలిటీ సీట్లు..

వైద్య రంగానికి జీవం పోశారు..

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగానికి 2019–24 మధ్య ఒక స్వర్ణయుగం అని వైద్యరంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్టం చేసేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా ఉదారంగా నిధులు మంజూరు చేసి, రానున్న రోజుల్లో అదనంగా సీట్లు మంజూరుకు అవసరమైన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో 250 సీట్లకు అనుగుణంగా రూ.90 కోట్లతో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా ఇప్పటికే ఉన్న 175 సీట్లకు అదనంగా మరో 75 సీట్లు ఎన్‌ఎంసీ(నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌) మంజూరు చేసింది.

రూ.90 కోట్లతో నిర్మాణాలు..

రాష్ట్రంలోని బోధనాస్పత్రులను నాడు–నేడు పనుల ద్వారా అభివృద్ధికి నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో రూ.170 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టాలని అంచనా వేశారు. అందులో భాగంగా తొలివిడగా రూ.90 కోట్లతో 250 సీట్లకు అనుగుణంగా సిద్ధార్థ వైద్య కళాశాలలో తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రెరీ వంటి సౌకర్యాల కోసం నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో వేగంగా జరిగిన పనులు, ప్రస్తుతం నత్త నడకన సాగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా, ఇంకా ఎలక్ట్రికిల్‌, డ్రెయినేజీ, వాటర్‌ పైప్‌లైన్‌ వంటి పనులు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సైతం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.

సౌకర్యాల కల్పనతోనే సాధ్యం..

ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఇప్పటికే 175 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వాటిని అదనంగా మరో 75 సీట్లు మంజూరు చేయాలని ఈ ఏడాది కళాశాల తరఫున నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌కు దరఖాస్తు చేశారు. దీంతో ఎన్‌ఎంసీ బృందం వచ్చి తనిఖీలు చేసింది. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు, ప్రభుత్వాస్పత్రిలోని సౌకర్యాలను చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌లతో పాటు, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయంటూ మరో 75 సీట్లు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

సిద్ధార్థ వైద్య కళాశాలలో 2014–19 కాలంలో ఒక్క అదనపు సీటు కూడా మంజూరు కాలేదు. కానీ 2019–24 సమయంలో సౌకర్యాల కల్పనతో పలు విభాగాల్లో దాదాపు 80 పీజీ సీట్లు మంజూరు అయ్యాయి. అంతేకాదు సూపర్‌ స్పెషాలిటీ విభాగాలైన న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాల్లో సైతం ఒక్కో విభాగంలో ఐదు సీట్లు మంజూరు అయ్యాయి. వాటితో పాటు ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ వంటి విభాగాల్లో కూడా సీట్లు మంజూరయ్యాయి. దీంతో ప్రభుత్వాస్పత్రిలో పీజీలు ఏడాదికి వంద మంది చొప్పున పెరగనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్‌లు అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది.

వైద్య రంగానికి వైఎస్‌ జగన్‌ జీవం పోశారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు వెంటిలేటర్‌పై ఉన్నాయి. అలాంటి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా, వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు పెద్ద ఎత్తున చేపట్టారు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉన్న కళాశాలలను అభివృద్ధి చేసి మరిన్ని సీట్లు వచ్చేలా కృషి చేశారు.

– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ, వైద్య విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement