పలు మండలాల్లో
పెసర సాగు విస్తీర్ణం
సాగు రెట్టింపైనా ప్రయోజనం శూన్యం
మాగాణిలో సాగు చేసిన రైతులకు నిరాశే
శ్రమ, పెట్టుబడి మొత్తం నష్టం
పూర్తిగా నష్టపోయాం..
ప్రయోజనం లేని పంట
ఖమ్మంవ్యవసాయం: ఏటా వానాకాలంలో మెట్ట భూముల్లో పెసర సాగు చేయడం ఆనవాయితీ. అయితే కొందరు రైతులు మాగాణి భూముల్లోనూ పెసర వేస్తారు. వరి నాట్ల సమయానికి భూసారం పెరిగేలా పెసరను పచ్చిరొట్ట ఎరువుగా భూమిలో కలియదున్నుతారు. అయితే, ఈ ఏడాది అరకొరగా కురిసిన వర్షాలతో చేతికొస్తుందన్న ఆశించిన పలువురు మాగాణిలోనూ పెసర విస్తీర్ణాన్ని పెంచారు. కానీ పైరు రొట్టగా మారివారి ఆశలు అడియాశలు చేశాయి.
అంచనాలకు మించి సాగు
జిల్లాలో ఈ ఏడాది వానాకాలం అన్నీ కలిపి 5.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో పెసర 15,607 ఎకరాల్లో ఉంటుందని భావిస్తే... అంచనాలకు మించి 30,169 ఎకరాల్లో సాగైంది. మెట్ట, మాగాణి భూముల్లో 15వేల చొప్పున ఎకరాల్లో పెసర సాగు చేశారు. మెట్ట భూముల్లో వేసిన పంట ఎకరాకు రెండు క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చినా... మాగాణి భూముల్లో పైరు పెరిగిప్పటికీ పూత, కాత రాలేదు.
ఆవిరైన ఆశలు
వర్షాభావ పరిస్థితుల్లో పెసర సాగు అనుకూలమని అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వం చెప్పడంతో రైతులు కనీస ఆదాయం పొందొచ్చని వరి పండించే మాగాణి భూముల్లోనూ పెసర వేశారు. జూన్‌లో కురిసిన వర్షాలకు పైరు బాగానే మొలవగా.. ఎకరాకు ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ పైరు ఏపుగా పెరిగిందే తప్ప పూత, కాత అంతంత మాత్రంగా వచ్చింది. సాధారణంగా మాగాణి భూములు గతంలో వేసిన ఎరువులతో సారం కలిగి ఉంటాయి. దీంతో పెసర పైరు ఏపుగా పెరిగి రొట్టగా మారి ఫలితం దక్కలేదు. పంట రావాల్సిన పైరు రొట్టగా మారడంతో రైతులకు నిరాశ ఎదురైంది.
శ్రమ, పెట్టుబడి.. నష్టం
మాగాణిలో సాగు చేసిన పెసర రొట్టగా మారడంతో రైతుల శ్రమ, పెట్టుబడి వృథా అయ్యాయి. సాగు కోసం భూములను రెండేసి సార్లు దున్నించారు. దుక్కి దున్నడం, విత్తనాలకు కలిపి ఎకరాకు రూ.10 వేల వరకు వెచ్చించగా.. పైరు ఏపుగా పెరగడంతో ఎకరాకు పెట్టుబడి పోను రూ. 20వేల నుంచి రూ.25 వేల ఆదాయం వస్తుందని ఆశించారు. తీరా సరైన పూత లేక, కాత రాకపోవడంతో పెట్టుబడైనా వస్తాయని భావించారు. కానీ చివరకు రొట్టగా మారడంతో పైరుతో పాటు ఆశలనూ వదిలేసుకున్నారు.
మండలం విస్తీర్ణం
(ఎకరాల్లో)
చింతకాని 8,129
కొణిజర్ల 5,770
వైరా 3,382
తిరుమలాయపాలెం 1,485
రఘునాథపాలెం 1,397
ముదిగొండ 1,377
ఏన్కూరు 1,161
తల్లాడ 1,095
ఖమ్మం రూరల్ 1,011
వరి వేయాల్సిన మాగాణి భూముల్లో సాగర్ నీరు రాదని పెసర వేశాం. గతంలో వేసిన ఎరువులతో సారం ఎక్కువై పెసర రొట్టగా పెరిగిందే తప్ప పంట రాలేదు. ఎకరాకు దాదాపు రూ.10 వేల మేర నష్టం వచ్చింది.
– నాగేశ్వరరావు,
వెంకటగిరి, ఖమ్మం రూరల్ మండలం
రెండెకరాల మాగాణి భూమిలో పెసర సాగు చేశా. తొలుత ఆశాజనకంగా ఉన్నా.. చివరకు రొట్టగా పెరిగి ప్రయోజనం దక్కలేదు. వర్షాభావంతో పెసర మాత్రమే సాగు చేస్తే పెట్టుబడి కూడా రాక నిరాశ ఎదురైంది.
– దారగాని లక్ష్మీనారాయణ,
గంధసిరి, ముదిగొండ మండలం


