మరో మూడేళ్లు పడుతుందా?
మూడేళ్లలో 60 శాతమే పూర్తి
భూసేకరణ సమస్యతో నిర్మాణానికి అడ్డంకులు
ముంపు ముప్పు
మున్నేటి వరద ముప్పు నుంచి ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలానికి శాశ్వత రక్షణ ఎప్పుడు లభిస్తుందనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. ఏటా వర్షాకాలం వస్తుందంటే మున్నేరు పరీవాహక కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఈక్రమాన ముంపు కట్టడికి రిటైనింగ్ వాల్ నిర్మాణం మొదలుపెట్టినా పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. సుమారు 17 కి.మీ.కు గాను 10 కి.మీ. మేర పూర్తయింది. అరవై శాతానికి పైగా పనులు పూర్తయినా మిగిలిన పనులతో పాటు డ్రెయిన్లు, రహదారుల నిర్మాణం భూసేకరణలో ఆలస్యంతో నత్తనడకన సాగుతోంది. – ఖమ్మం అర్బన్
2024 వరదలతో కకావికలం
మున్నేటికి ఎగువన కురిసిన భారీ వర్షాలతో 2024 ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ఉప్పొంగింది. మున్నేటిని ఆనుకుని ఉన్న 20 డివిజన్లలోని కాలనీలు వరదలో చిక్కుకోగా వేలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అంతకు ముందు ఏడాది కూడా మున్నేరు భారీగా ప్రవహించడంతో ఇదే పరిస్థితి ఎదురైంది. ఈక్రమాన గత ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదించగా నిధులు సైతం మంజూరయ్యాయి. అనంతరం ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడంతో పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు.
రెండేళ్ల గడువు.. ఆ తర్వాత ఇంకో రెండేళ్లు
మున్నేటికి ఇరువైపులా సుమారు 17 కి.మీ. మేర రిటైనింగ్ వాల్ నిర్మాణంతో డ్రెయిన్లు, రహదారుల నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు సుమారు రూ.975 కోట్లతో ప్రతిపాదించారు. ఇంత మొత్తంలో నిధులు ఒకేసారి విడుదల చేయడం భారంగా మారడంతో తొలిదశగా సుమారు రూ.690 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. 2024లో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని నిబంధనల్లో పొందుపరిచారు. కానీ వర్షాలు, ఇసుక కొరత, కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో జాప్యం, భూసేకరణ సమస్యలతో పనులు వేగంగా జరగలేదు. ఫలితంగా పనుల పూర్తికి మరో రెండేళ్లపాటు గడువు పొడిగించినా అదే పరిస్థితి నెలకొంది.
సవాల్‌గా మారిన భూసేకరణ
రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సుమారు 239 ఎకరాల భూమి అవసరమవుతోంది. ఇందులో 144 ఎకరాలు పట్టా భూములు, 11 ఎకరాలు ప్రభుత్వ భూమితో ఉన్నా మరో 84 ఎకరాలు ఎన్నెస్పీ భూములు అవసరమని గుర్తించారు. ప్రభుత్వ, ఎన్పెస్పీ భూముల ప్రాంతాల్లో పనులు వేగంగా జరుగుతున్నా, పట్టా భూములు, ప్లాట్ల ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు. నిర్వాసితులతో అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించినా పరిహారం తేలలేదు. భూములు కోల్పోయే వారికి ఇచ్చేలా ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో ఎన్నెస్పీకి చెందిన మిగులు భూములు 124 ఎకరాలను గుర్తించారు. ఈ భూమిని అభివృద్ధి చేసి అప్పగించాలని నిర్ణయించినా బదలాయింపులో జాప్యం జరిగింది. ఇటీవలే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి రోడ్లు నిర్మించారు.
580 కుటుంబాలపై ప్రభావం
రిటైనింగ్ వాల్ నిర్మాణంతో మున్నేటికి ఇరువైపులా 580 మంది ఇళ్లు, ఇంటి స్థలాలు, భూములు కోల్పోనున్నారు. ఇందులో కొందరికి ప్రత్యామ్నాయ స్థలాలు, పరిహారం అందించే చర్యలు మొదలయ్యాయి. అయితే, భూసేకరణలో జాప్యం, పరిహారం విషయంలో కొందరి అభ్యంతరాలతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.
డ్రెయిన్, రహదారులూ కీలకమే..
మున్నేటికి రిటైనింగ్ వాల్‌తో పాటు నగర, రూరల్ మండల ప్రాంతాల నుంచి వచ్చే వరదను మున్నేరులోకి మళ్లించేందుకు డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రిటైనింగ్ వాల్, డ్రెయిన్ మధ్యలో రహదారి కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. రిటైనింగ్ వాల్ ప్రారంభమయ్యే దానవాయిగూడెం సమీపం నుంచి ప్రకాశ్‌నగర్ వరకు ప్రారంభంలో 20 మీటర్లుగా, ముగింపు వద్ద సుమారు 40 మీటర్ల వెడల్పుతో డ్రెయిన్ నిర్మించాలని నిర్ణయించారు. అలాగే, డ్రెయిన్ – రిటైనింగ్ వాల్ మధ్య పది మీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రిటైనింగ్ వాల్‌తోపాటు డ్రెయిన్, రహదారి కూడా పూర్తయితేనే మున్నేటి వరదను సమర్థంగా నియంత్రించే అవకాశం ఉంటుంది.
రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇప్పటివరకు దాదాపు 10 కి.మీ. మేర పూర్తయింది. మిగిలిన ప్రాంతాల్లో భూమి సేకరించి నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు డ్రెయిన్లు, రహదారులు నిర్మించాలి. ప్రస్తుత వేగాన్ని పరిశీలిస్తే మరో రెండు, మూడేళ్లు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది మున్నేటికీ వరద రాకున్నా గత అనుభవాల దృష్ట్యా పనులు వేగంగా జరిగేలా భూసేకరణ సమస్యలు పరిష్కరించడంతో పాటు సరిపడా నిధులు విడుదల చేయాల్సిన అవసరముంది.
నత్తనడకన మున్నేటి
రిటైనింగ్ వాల్ పనులు


