ఖమ్మం వైరారోడ్: నగరంలో పేద ప్రజల ఇళ్లను ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లకు రక్షణ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన శ్రీనివాస్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న ఇళ్ల నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలుగుమట్లలో పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను అర్ధరాత్రి వేళ నేలమట్టం చేయడం బాధాకరమైన విషయమని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 3 వేల మంది పేదలకు జీఓ నంబర్ 58 ద్వారా స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించామని గుర్తుచేశారు. వెలుగుమట్ల, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో కేసీఆర్ స్వయంగా పరిశీలించి న్యాయం చేశారని అన్నారు. మళ్లీ 2023 ఫిబ్రవరిలో జీఓను పొడిగించి ఖమ్మంలో అర్హులైన పేదలలకు పట్టాలు అందించామన్నారు. శ్రీనివాసనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో 696 కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని కమిషనర్, ఉన్నతాధికారులు గుర్తించారని తెలిపారు. కోర్టు ఆదేశించినట్లు వారం రోజుల్లో సరైన నివేదిక తయారుచేసి, నిరుపేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, నిరోషా, తిరుమల్ రావు, సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్


