మూడు జిల్లాలు.. 2,646 మె.టన్నులు | - | Sakshi
Sakshi News home page

మూడు జిల్లాలు.. 2,646 మె.టన్నులు

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

చింతకాని: మూడు జిల్లాల అవసరాల కోసం ఎన్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీకి చెందిన 2,646 మెట్రిక్‌ టన్నుల యూరియా ఆదివారం చేరుకుంది. చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు యూరియా చేరిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 1,846 మెట్రిక్‌ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 400 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 300 మె.టన్నులు కేటాయించగా, మరో 100 మె.టన్నులు బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.

జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లలో సబ్‌ జూనియర్స్‌ విభాగం నుంచి జిల్లా క్రీడాకారులు ముగ్గురికి స్థానం దక్కింది. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో శిక్షణ పొందుతున్న సీహెచ్‌.జయంత్‌, బి.గీతిక్‌ బాలుర జట్టుకు, బి.జీవన బాలికల జట్టుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని కోచింగ్‌ క్యాంప్‌నకు హాజరుకానున్న వీరు, ఈనెల 27నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులను బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు విజయసారథి, కోచ్‌ చంద్రకాంత్‌ అభినందించారు.

హామీలు అమలు చేయాలి

టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు విజయ్‌, పద్మ

ఖమ్మం సహకారనగర్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీపీఎఫ్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌. విజయ్‌, వై.పద్మ హెచ్చరించారు. ఆదివారం సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం, ఉద్యోగుల ఆందోళనలను చులకనగా చూడటం సరికాదన్నారు. పెండింగ్‌ పీఆర్సీ, డీఏ సమస్యలను పరిష్కరించాలన్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు పి. నాగిరెడ్డి, టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు, జిల్లా నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సంధ్యారాణి, ఉమాదేవి, హనుమంతరావు, వైకేయూ బాషా తదితరులు పాల్గొన్నారు.

23 నుంచి పట్టణ ప్రాంతాల్లో ‘ఏక్‌ పేడ్‌.. మా కే నామ్‌’

ఖమ్మం సహకారనగర్‌: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ఈ నెల 19వ తేదీన గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఒక్క రోజే 1,10,681 మొక్కలు నాటారు. దీంతో ఈ నెల 23 నుంచి పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ ఆదేశించారు. అర్బన్‌ ప్రాంతాల్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. డీఆర్‌డీఏ, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ, సాంఘిక, గిరిజన సంక్షేమ, మైనార్టీ తదితర శాఖలు, తెలంగాణ ప్రైవేటు పాఠశాలల సంఘం(ట్రస్మా) తదితరుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని డీఈఓ సదానందం సమన్వయం చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం

ఆర్పీఎఫ్‌ కమిషనర్‌ నవీన్‌కుమార్‌

ఖమ్మంక్రైం: రైల్వే ఆస్తుల రక్షణతోపాటు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్పీఎఫ్‌ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ సూచించారు. రైజింగ్‌ డే వేడుకల్లో భాగంగా ఆదివారం ఆర్పీఎఫ్‌ సికింద్రాబాద్‌ డివిజనల్‌ కమిషనర్‌ ఖమ్మంలోని ఆర్పీఎఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ సందర్శించారు. రైల్వే భద్రత, సిబ్బంది విధులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణ, అప్రమత్తత ముఖ్యమని సిబ్బందికి సూచించారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. ఆర్పీఎఫ్‌ సీఐ బుర్రా సురేష్‌గౌడ్‌, ఏఎస్‌ఐలు మెడీనిషా, రాంబాబు, సలాం, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement