పెద్దాస్పత్రిలో పరికరాల నిర్వహణ
కాంట్రాక్టర్‌కు..
మరమ్మతులు వస్తే వెంటనే సరిచేసే అవకాశం
తొమ్మిది హాస్పిటళ్ల పైలట్ ప్రాజెక్టు జాబితాలో జిల్లా ఆస్పత్రి
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికి త్స, పరీక్షలకు ఉపయోగించే ఏదైనా పరికరం మరమ్మతుకు వస్తే రోజులు, నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. సంబంధిత కంపెనీ నిపుణులు వచ్చి పరిశీలించి చిన్న మరమ్మతులు అవసరమైతే స్థాని కంగా లభించే విడిభాగాలతో సరిచేస్తున్నారు. అదే కీలకమైన పరికరాలు మొరాయించి, మరమ్మతులకు రూ.వేలు, రూ.లక్షలు కావాల్సి వస్తే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించి అనుమతి వచ్చేసరికి రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యాన పరికరాల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. తద్వారా ఎలాంటి మరమ్మతులైనా తక్కువ సమయంలో పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడనుంది.
తొమ్మిది ఆస్పత్రుల్లో ఖమ్మం..
పలు ఆస్పత్రుల్లో బయో మెడికల్ పరికరాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్‌కు అప్పగించింది. తొలి దశగా మొత్తం తొమ్మిది ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అనుమతి ఇవ్వగా, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి, నిలోఫర్ మహిళా శిశు ఆస్పత్రి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎమ్‌ఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ కేన్సర్ సెంటర్, కింగ్‌కోటి ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జీజీహెచ్‌తో పాటు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కూడా ఇందులో ఉంది. ఆయా ఆస్పత్రుల్లో పరికరాల మరమ్మతులకు టీజీఎమ్‌ఎస్‌ఐడీసీ సాధారణ నిధుల నుంచి కేటాయించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ప్రాజెక్టు అమల్లోకి రానుండగా, ఆస్పత్రుల్లోని పరికరాల జాబితా పంపించాలని సూచించారు.


