● చివరిసారి 2016 జూలై 19న ఆర్‌టీసీలో ఎన్నికలు ● నాడు ఆరు డిపోల పరిధిలో 2,950, నేడు ఏడింట్లో 1,808 ఓట్లే.. ● ‘గుర్తింపు’ ఎన్నికల్లో ప్రధాన సంఘాల మధ్యే పోటీకి అవకాశం ● ఎన్నికల నిర్వహణపై కార్మికుల్లో హర్షాతిరేకాలు
2016 జూలై 19న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో నాటి అధికార పార్టీకి చెందిన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) విజయం సాధించింది. ఖమ్మం రీజియన్‌కు వచ్చే సరికి మాత్రం భిన్నమైన ఫలితం నమోదైంది. వామపక్ష పార్టీలకు అనుబంధంగా ఉన్న ఎస్‌డబ్ల్యూఎఫ్–ఈయూ కూటమిగా పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా రీజియన్ గుర్తింపు సంఘంగా నిలిచింది. ఇక రీజియన్‌లో రెండో స్థానంలో టీఎంయూ, మూడో స్థానంలో ఎన్‌ఎంయూ నిలిచాయి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో రీజియన్‌లో పోటీ రెండు ప్రధాన సంఘా ల మధ్యే పోటీ ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
ఖమ్మం మయూరిసెంటర్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ)లో సుదీర్ఘ కాలం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. చివరిసారి 2016 జూలై 19న యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరగ్గా, సరిగ్గా పదేళ్ల అనంతరం సమరానికి తెరలేచింది. ఈ నేపథ్యాన ఖమ్మం రీజియన్‌లోని ప్రధాన సంఘాలు ఎన్నికలను స్వాగతిస్తూ తమ గుర్తింపును చాటుకునేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అటు రాష్ట్ర, ఇటు రీజియన్ స్థాయిలో మొదటి వరసలో నిలిచేలా పోటీకి సిద్ధమవుతున్నారు.
పెరిగిన డిపోలు.. తగ్గిన ఓటర్లు
2016 గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినప్పుడు ఖమ్మం రీజియన్ పరిధిలో ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోలు ఉన్నాయి. ఆతర్వాత ఇల్లెందు డిపో ఏర్పాటవడంతో ఆ సంఖ్య ఏడుకు చేరింది. 2016 నాటి ఎన్నికల్లో 2,950 మంది ఓటర్లు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు వేయికి పైగా తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం రీజియన్‌లో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు 1,808 మందే ఉన్నారు. గత దశాబ్ద కాలంలో పెరిగిన ఉద్యోగ విరమణలు, కొత్త నియామకాలు లేకపోవడంతో ఓటర్ల సంఖ్య 1,100 వరకు తగ్గింది. కొత్తగా చేపట్టిన నియామకాలన్నీ కాంట్రాక్ట్ విధానంలో కావడంతో ఆయా ఉద్యోగులకు ఓటు హక్కు లేదు. ఓట్ల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యాన అక్టోబర్ 9న జరిగే ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా నిలవనుంది.
ప్రధాన డిమాండ్లే అజెండాగా..
ఈ ఏడాది అక్టోబర్ 9న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రధాన డిమాండ్లనే అజెండాగా తీసుకొని సంఘాలు ప్రచారంలో పాల్గొననున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం, ఉద్యోగులకు పూర్తిస్థాయి ప్రభుత్వ ప్రయోజనాల సాధన ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అలాగే, నిలిచిపోయిన పే–రివిజన్, బకాయిల విడుదల కూడా అజెండాలో చేరనుంది. ఇక రీజియన్‌లోని ఏడు డిపోలకు సరిపడా కొత్త బస్సులు తీసుకురావడం, ఉద్యోగుల నియామకం, కార్మికుల సమస్యలు పరిష్కారం, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందిపై పెరుగుతున్న పనిభారానికి చెక్ పెట్టడం వంటి డిమాండ్లు బలంగా వినిపించనున్నారు.
వెల్ఫేర్ బోర్డుకు చెక్
గత ప్రభుత్వం 2016 జూలైలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించింది. అనంతర కాలంలో కార్మికులు పలు డిమాండ్లతో 50 రోజుల పాటు సమ్మె చేసి విధులకు దూరంగా ఉన్నారు. సమ్మె విరమించాక నాటి ప్రభుత్వం గుర్తింపు సంఘాలను రద్దు చేయడంతో పాటు తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. కార్మికుల సమస్యలను వినేందుకు ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డును తీసుకొచ్చి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడం మొదలైంది. కానీ ఈ విధానంలో కార్మికుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదనేది చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల్లో భాగమైన గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు ప్రకటన చేయడమే కాక.. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. దీంతో కార్మికులు, సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.


