మధిర: మధిర మండలం వంగవీడు గ్రామంలో నాయక్ యూత్ ఆధ్వర్యాన ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా స్వామి వారి చేతిలో పూజలు అందుకున్న లడ్డూ వేలం నిర్వహించగా బానోత్ శ్రీను రూ.1,26,116కు దక్కించుకున్నారు. అనంతరం స్వామి వారి విగ్రహాన్ని వంగవీడు చెరువులో నిమజ్జనం చేశారు. ఇక మధిర మెయిన్‌రోడ్డులోని వినాయక దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాన్ని స్థానిక చెరువులో నిమజ్జనం చేయగా తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో భారీ వర్షం
సత్తుపల్లిరూరల్: కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న సత్తుపల్లిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడగా ప్రజలు ఉపశమనం పొందారు. సింగరేణి ప్రాంతంలో 55 మి.మీ.వర్షపాతం నమోదైంది. ఈమేరకు సత్తుపల్లి జేవీ ఆర్, కిష్టారం ఓసీల్లో నీరు చేరగా 15వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి, 1.02 లక్షల టన్నుల మట్టి తొలగింపు నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. భారీ వర్షంతో గనుల్లో నిలిచిన నీటి ని భారీ మోటార్ల సాయంతో బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఉరివేసుకుని
వ్యక్తి ఆత్మహత్య
పెనుబల్లి: మనస్థాపంతో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లంకా శేషయ్య బంజర గ్రామానికి చెందిన గొరిపత్తి నాగేశ్వరావు (40) భార్య ఇటీవల చనిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. వీరికి ఒక కుమారుడు. ఈనేపథ్యాన ఆదివారం గ్రామం పరిధిలోని ఆయిల్‌ఫామ్ తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న వీఎం బంజర ఎస్సై షేక్.షాకీర్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ షాకీర్ విచారణ చేపట్టారు.


