● పేషెంట్‌ను చూసి హైదరాబాద్‌కు బయలుదేరిన న్యూరోసర్జన్ ● కుటుంబసభ్యులను చేరకుండానే రోడ్డు ప్రమాదంలో మృతి
ఖమ్మం అర్బన్: రాత్రి వరకు వైద్యులు, విద్యార్థులతో కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని, తెల్లవారుజామున అత్యవసర కేసు రావడంతో ఆస్పత్రికి వెళ్లి పరిశీలించి హైదరాబాద్‌కు బయలుదేరిన న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్‌బాబు ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలిలా.. శనివారం రాత్రి మమత ఆస్పత్రిలో వినాయక నిమజ్జన వేడుకల్లో సందడి చేసిన జగదీష్‌బాబు ఆదివారం తెల్ల వారుజామున అత్యవసర కేసు రాగా ఆస్పత్రికి వెళ్లి పరీక్షించి సోమవారం ఆపరేషన్ చేయాలని భావించి హైదరాబాద్ బయలుదేరాడు. ఈక్రమాన మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. కాగా, సురక్షిత ప్రయాణం కోసం సుమారు రూ.1.20 కోట్లు వెచ్చించి రెండు నెలల క్రితమే కారును కొనుగోలు చేసినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయిందని వైద్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మమత ఆస్పత్రి వరకు అంతిమయాత్ర..
సూర్యాపేటలో పోస్టుమార్టం అనంతరం డాక్టర్ జగదీష్‌బాబు మృతదేహాన్ని ఖమ్మానికి తీసుకురాగా మమత ఆస్పత్రి వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. మమత ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మమత వైద్య విద్యాసంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, వామపక్ష నేతలు నున్నా నాగేశ్వరరావు, విక్రమ్, పోటు రంగారావు, గుండాల కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్, బాగం హేమంతరావు, తదితరులు మృతదేహానికి నివాళులర్పించారు. జగదీష్ భార్య, చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం డాక్టర్ స్వగ్రామమైన ఏపీ రాష్ట్రంలోని కొత్తపట్నం మండలం సంకువారిగుంట గ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు.


