● బెంగళూరులో మార్కెట్లు కిటకిట
● గణపయ్యలకు పూజలు చేసి ఇళ్లకు తరలింపు
● పూలు, పండ్లకు గిరాకీ
శివాజీనగర, బనశంకరి: రాజధాని నగరంతో పాటు రాష్ట్రమంతటా గౌరీ–గణేష చతుర్థి పండుగ సందడి మిన్నంటుతోంది. ప్రజలు పండుగ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. కొన్ని నెలలుగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వేడి తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, సామాన్యులు, మధ్య తరగతి ప్రజల ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. పూజలు, పిండివంటలతో పండుగ సంప్రదాయాన్ని ఘనంగా చేసుకోవడానికి మార్కెట్లకు వెల్లువెత్తారు. ఉద్యాననగరిలో యశ్వంతపుర మార్కెట్, కే.ఆర్.మార్కెట్, మల్లేశ్వరం, విజయనగర, గాంధీ బజార్, బసవనగుడి, జయనగర వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు, పూలు పండ్లు, మిఠాయిల షాపింగ్ శనివారమంతా జోరుగా జరిగింది. ముఖ్యంగా మహిళలతో విపణులు కిక్కిరిసిపోయాయి. ఏకదంత మూర్తులను పూజలు చేసి బైక్‌లు, కార్లలో తీసుకెళ్లారు. మొదటిరోజు గౌరీదేవి వ్రతాన్ని ఆచరించి, మరుసటి దినం గణేశ చవితిని ఆచరించడం ఆనవాయితీ.
గతంకంటే ధరల మోత తక్కువే
● గత వరలక్ష్మీ పండుగ సమయంలో మార్కెట్లో పూల ధరలు ఆకాశన్నంటాయి. ఈసారి, గణేశ పండుగకు అంత లేదు. చిల్లర వ్యాపారులు మాత్రమే ధరలను స్వల్పంగా పెంచారు.
● కనకాంబరాలు కేజీ రూ.1500 వరకు అమ్ముడవుతుండగా, మల్లెలు కిలో రూ.500కు లభిస్తున్నాయి. గులాబీలు, చామంతులు, డాలియా పుష్పాలు కిలో రూ.200– 300 మధ్య విక్రయిస్తున్నారు.
● ఏకదంతునికి ప్రీతికరమైన అరటిపండ్లు, దానిమ్మలు, ద్రాక్షలకు గిరాకీ ఎక్కువగా ఉంది. యాలక్కి అరటిపండ్లు మినహా, ఇతర పండ్ల ధరలు స్థిరంగా ఉన్నాయి.
● యాపిల్స్, దానిమ్మలు కిలో రూ.200 నుంచి రూ.250 మధ్య ఉన్నాయి.
● అధిక డిమాండ్ ఉన్న యాలక్కి అరటి కేజీ రూ.100 నుంచి రూ.120 వరకు ఉంది.
● మూసంబిలు కేజీ రూ.120, సపోటా రూ.120 నుంచి రూ.150 పలికాయి.
నిత్యావసరాలు భగ్గు
వంట నూనెలు, పప్పులు, వివిధ బ్రాండ్ల బియ్యం, చక్కెర, బెల్లం, మైదా ధరలు గత పండుగల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు వాపోయారు. ఖర్చు రెట్టింపు అయినప్పటికీ పండుగకు సంకోచం లేకుండా కొనుగోలు చేయడంతో మార్కెట్లు కళకళలాడాయి.


