నంది జలధార తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

నంది జలధార తగ్గుముఖం

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని కాడుమల్లేశ్వర ఆలయ సమీపంలోని ప్రసిద్ధ నందితీర్థం ఆలయంలో ఉన్న నంది విగ్రహం నోటి నుంచి జాలువారే జలధార శివలింగంపై పడి నిత్యం జలాభిషేకం జరగడం అందరికీ తెలిసిందే. దీన్ని భక్తులు ప్రకృతి వింతగా భావిస్తారు. అయితే ప్రస్తుతం నంది విగ్రహం నోటి నుంచి వచ్చే జలధార తగ్గిపోవడం భక్తులను కలవరపెడుతోంది. ఈ జలధార రోజురోజుకూ తగ్గిపోతోందని పూజారి ప్రసన్న భట్‌ చెప్పారు. దేవాలయంలోనే కాదు, సమీపంలోని శాంకీ చెరువులో కూడా నీటి నిల్వ తగ్గిపోతోంది. వర్షాభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. శివలింగానికి ప్రస్తుతం నిత్యం జలాభిషేకం జరుగుతున్నా రాబోయే రోజుల్లో నంది విగ్రహం నోటి నుంచి వచ్చే జలధార ఆగిపోవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.

బైక్‌ను కారు ఢీకొని

ముగ్గురు మృతి

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ఆర్‌.ఎస్‌.దొడ్డి సమీపంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద గురువారం రాత్రి బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. మృతులను హనూరు తాలూకా కొప్ప గ్రామానికి చెందిన సురేష్‌ (24), మహేంద్ర (35), మునియప్ప (35)గా గుర్తించారు. గౌరీ గణేష్‌ పండుగకు సిద్ధమవుతున్న ఈ ముగ్గురూ కొళ్లెగాలకు వెళ్తుండగా, మలె మహదేశ్వర కొండ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు వారి బైక్‌ను ఢీకొంది. ప్రమాద తీవ్రతకు ఇద్దరి మృతదేహాలు ఛిద్రమయ్యాయని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న హనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు, బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

స్కూలు విద్యార్థుల

షూ కుంభకోణం

సుమోటోగా కేసు నమోదు

విచారణకు ఉప లోకాయుక్త ఆదేశం

శివాజీనగర: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాసిరకం బూట్లు పంపిణీ చేసిన తీవ్రమైన కేసుకు సంబంధించి ఉప లోకాయుక్త జస్టిస్‌ కే.ఎన్‌.ఫణీంద్ర సుమోటోగా ఫిర్యాదు నమోదు చేసి, కఠిన దర్యాప్తునకు ఆదేశించారు. బాలల సంక్షేమ పథకంలోని అవినీతిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన బూట్లు వారం రోజుల్లోనే చిరిగిపోయాయని, వేసుకున్న కొంతసేపటికే కుట్లు ఊడాయని మీడియాలో వార్తలొచ్చాయి. గతంతో పోల్చితే ఈసారి కొనుగోలు ప్రక్రియ, పర్యవేక్షణలో వ్యవస్థీకృత అవినీతి ఉన్నట్లు స్పష్టమైంది. విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిరంతరంగా నిర్లక్ష్యం వహించడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెకర్లు(డీడీపీఐ), బ్లాక్‌ విద్యాధికారు(బీఈఓ)లపై అధికారికంగా కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి, రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సంబంధిత జిల్లాల లోకాయుక్త పోలీస్‌ సూపరింటెండెంట్ల (ఎస్పీల)కు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై

రాహుల్‌గాంధీ అభ్యంతరం

శివాజీనగర: 2028 ఎన్నికలలో తాను పోటీ చేయబోనని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలతో పార్టీకి ఎదురుదెబ్బ తగలవచ్చని ఆయన హెచ్చరించారు. మండ్య జిల్లాలోని కే.ఆర్‌.పేటెలో జరిగిన కే.ఆర్‌.పేటె కృష్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ అధినేత, కేంద్ర ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సిద్దరామయ్యకు కొన్ని సలహాలు ఇచ్చినట్లు సమాచారం. మీ ప్రకటన కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగించవచ్చు. పార్టీకి మీలాంటి సీనియర్‌ నాయకులు చాలా అవసరం. అందువల్ల అలాంటి ప్రకటనలు చేయవద్దని రాహుల్‌ చెప్పినట్లు తెలిసింది. కాగా రాహుల్‌ గాంధీకి తాను చేసిన ప్రకటనపై సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. తాను ఎన్నికల రాజకీయాల నుంచి విరమిస్తున్నానని చెప్పాను కాని రాజకీయాల నుంచి కాదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement